‘బెస్ట్’ మెస్సీ, షెల్లీ ఫ్రేజర్
పారిస్: గత ఏడాది అంతర్జాతీయ క్రీడా వేదికపై తమదైన ముద్ర వేసిన ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), మహిళా అథ్లెట్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ (జమైకా)లకు ప్రతిష్టాత్మక లారియస్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డులు లభించాయి. 2022 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా మెస్సీ... మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా షెల్లీ ఎంపికయ్యారు.
మెస్సీ సారథ్యంలో గత ఏడాది అర్జెంటీనా జట్టు 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్‌ను మూడోసారి సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మెస్సీ ఏడు గోల్స్ చేయడంతోపాటు సహచరులు మూడు గోల్స్ చేయడానికి సహాయపడ్డాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఉత్తమ ప్లేయర్‌గా నిలిచి ‘గోల్డెన్ బాల్’ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నాడు.
లారియస్ అవార్డు రావడం మెస్సీకిది రెండోసారి. 2020లోనూ మెస్సీకి ఈ పురస్కారం దక్కింది. మరోవైపు షెల్లీ ఆన్ ఫ్రేజర్ 100 మీటర్ల విభాగంలో ఐదోసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఓవరాల్‌గా షెల్లీ మూడు ఒలింపిక్స్ పసిడి పతకాలను, పది ప్రపంచ చాంపియన్‌షిప్ బంగారు పతకాలను గెల్చుకుంది.
స్పెయిన్ టెన్నిస్ యువతార కార్లోస్ అల్‌కరాజ్‌కు ‘బ్రేక్‌త్రూ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. గత ఏడాది అల్‌కరాజ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలువడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. 1999 నుంచి లారియస్ గ్లోబల్ స్పోర్ట్స్ అవార్డులను అందజేస్తున్నారు.
సౌదీ లీగ్‌లో మెస్సీ!
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో బాటలోనే మెస్సీ నడవనున్నాడు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్‌జీ) క్లబ్‌కు ఆడుతున్న మెస్సీ ఈ సీజన్ తర్వాత పీఎస్‌జీని వీడి రొనాల్డో ఆడుతున్న సౌదీ అరేబియా లీగ్‌లో అడుగు పెట్టనున్నాడు. ఇప్పటికే సౌదీ అరేబియా లీగ్‌లోని ఒక క్లబ్ మెస్సీతో కళ్లు చెదిరే మొత్తానికి ఒప్పందం చేసుకుందని సమాచారం.
ఇది కూడా చదవండి: పతకానికి అడుగు దూరంలో..
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారత బాక్సర్లు నిశాంత్ దేవ్ (71 కేజీలు), దీపక్ భోరియా (51 కేజీలు) పతకం ఖరారు చేసుకోవడానికి మరో విజయం దూరంలో ఉన్నారు.
మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌లలో దీపక్ 5–0తో జాంగ్ జియామావో (చైనా)పై గెలుపొందగా... నిశాంత్ దేవ్ పంచ్‌ల ధాటికి అతని ప్రత్యర్థి ఫొకాహా నిదాల్ (పాలస్తీనా) చేతులెత్తేశాడు. నిశాంత్ పంచ్ పవర్‌కు తొలి రౌండ్‌లోనే ఫొకాహా రింగ్‌లో రెండుసార్లు కూలబడ్డాడు.
దాంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి నిశాంత్‌ను విజేతగా ప్రకటించాడు. మరోవైపు భారత్‌కే చెందిన సచిన్ సివాచ్ (54 కేజీలు), ఆకాశ్ సాంగ్వాన్ (67 కేజీలు)ల పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. సచిన్ 0–5తో సాబిర్ ఖాన్ (కజకిస్తాన్) చేతిలో, ఆకాశ్ 0–5తో దులాత్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment