ధ్యాన్ చంద్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, ప్రకాశ్ పదుకొణె, విశ్వనాథన్ ఆనంద్.. ఇలా భారత క్రీడా రంగంలో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నారు. అయితే, వీరిలా గుర్తింపునకు నోచుకోని ‘అన్‌సంగ్ హీరోలు’ కూడా చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలోని మేటి స్విమ్మర్ మిహిర్ సేన్ గురించి నేటి కథనంలో తెలుసుకుందాం!
భారతీయులకేం తక్కువ?
ఒకే ఏడాదిలో ఐదు ఖండాల్లోని మహా సముద్రాలను ఈదగల సత్తా భారతీయులకు ఉందని మిహిర్ సేన్ నిరూపించాడు. సాధారణ కుటుంబంలో జన్మించి.. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా చరిత్రకెక్కాడు. 1930లో బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించాడు మిహిర్ సేన్.
తల్లిదండ్రులు రమేశ్ సేన్- లీలావతి. మిహిర్‌కు ఎనిమిదేళ వయసు ఉన్నపుడు వారు ఒడిశాకు మకాం మార్చారు. కుమారుడికి మెరుగైన విద్య అందించేందుకు లీలావతి ఎంతగానో కష్టపడేవారు. చికెన్, కోడిగుడ్లు, పాలు అమ్ముతూ జీవనోపాధి పొందుతూ... కొడుకు కోసం డబ్బు కూడబెట్టేవారు. తల్లి కష్టాన్ని చూసిన మిహిర్ సేన్.. చదువులో రాణించాడు.
నైట్ పోర్టర్‌గా
న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం.. నాటి ఒడిశా ప్రభుత్వ సాయంతో ఉన్నత విద్య కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లాడు. అయితే, చదువు సాఫీగా సాగాలన్నా.. కడుపు నిండాలన్నా ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో మిహిర్ సేన్ ఓ రైల్వే స్టేషన్‌లో నైట్ పోర్టర్‌గా పనిచేసినట్లు కథనాలు ఉన్నాయి.
అయితే, ఆ తర్వాత మిహిర్ ఇంగ్లండ్‌తో భారత రాయబారి క్రిష్ణ మెనన్ దగ్గర ఉద్యోగంలో చేరాడట. లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదువుకుంటూ.. 1954లో లింకన్స్ ఇన్‌లోని బార్‌లో అడ్వకేట్‌గా తన పేరును నమోదు చేసుకున్నాడు
అంతగా నైపుణ్యం లేదు.. అయినా
అలా రోజులు గడుస్తుండగా.. స్విమ్మింగ్‌పై మక్కువ పెంచుకున్న మిహిర్ సేన్.. అమెరికన్ మహిళ ఫ్లోరెన్స్ చాడ్విక్‌ను చూసి స్ఫూర్తి పొందాడు. 1950లో ఫ్లోరెన్స్ ఇంగ్లిష్ చానెల్‌ను ఈదిన తొలి మహిళగా రికార్డు సృష్టించారంటూ వార్తా పత్రికలో వచ్చిన కథనం మిహిర్ దృష్టిని ఆకర్షించింది.
అయితే, ఈతలో మిహిర్‌కు అంత నైపుణ్యం లేదు. అయినప్పటికీ దేశం కోసం ఈ ఘతన సాధించాలని భావించాడు. స్థానికంగా ఉన్న నిపుణుల దగ్గరకు వెళ్లి పాఠాలు నేర్చుకున్నాడు. అలా 1958, సెప్టెంబరు 27న అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. డోవర్ నుంచి కలస్ వరకు 14 గంటల 45 నిమిషాల్లో చానెల్(32 కిలో మీటర్లు)ను ఈదాడు. అత్యంత వేగంగా ఈ దూరాన్ని దాటిన నాలుగో స్విమ్మర్‌గా నిలిచాడు.
ప్రధాని ఇందిరా గాంధీ మద్దతు
ఈ నేపథ్యంలో.. ఆ మరుసటి ఏడాది భారత ప్రభుత్వం మిహిర్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అయితే, ఆ ఒక్క చానెల్‌తో మిహిర్ స్మిమ్మింగ్ తృష్ణ తీరలేదు. ఐదు ఖండాల్లోని మహాసముద్రాలను ఈదాలని నిర్ణయించుకున్నాడు. కానీ అందుకు చాలా ఖర్చవుతుంది. ఎలాగోలా స్పాన్సర్లను సంపాదించిన మిహిర్‌కు నాటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా మద్దతుగా నిలిచారు.
ఇక తన ప్రయాణంలో భాగంగా తొలుత 1966లో ఏప్రిల్ 5-6 మధ్య భారత్- శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని 25 గంటల 26 నిమిషాల్లో ఈదాడు మిహిర్. అనంతరం.. యూరోప్-ఆఫ్రికా నడుమ జిబ్రాల్టర్ జలసంధిని దాటడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. అదే ఏడాది ఆగష్టు 24న 8 గంటల ఒక నిమిషంలో ఈ టార్గెట్‌ను పూర్తి చేశాడు. ఆ తర్వాత సెప్టెంబరు 12న 40 మైళ్ల దూరం ఉన్న డర్డానెల్స్(గల్లిపొలి, యూరోప్- సెడుల్బహిర్,ఆసియా మైనర్) ఈది.. ప్రపంచంలో ఈ ఫీట్ నమోదు చేసిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సాధించాడు.
అంతేకాదు.. అదే ఏడాది బొస్ఫరస్(టర్కీ)ను నాలుగు గంటల్లోనే ఈది ఈ ఘనత సాధించిన తొలి నానో-అమెరికన్‌గా నిలిచాడు. ఇక అక్టోబరు 29-31 మధ్య పనామా కాలువ(50 మైళ్ల పొడవు)ను 34 గంటల 15 నిమిషాల్లో ఈదేశాడు. తద్వారా గిన్నిస్ బుక్‌లో తన పేరును లిఖించుకున్నాడు. 1967లో పద్మవిభూషణ్ అవార్డు మిహిర్ సేన్ సొంతమైంది.
ఉద్యమం.. విజయవంతం
అయితే, ఇండియాకు తిరిగి వచ్చిన తొలినాళ్ల(1958)లో క్లబ్స్‌లో ప్రవేశించేందుకు మిహిర్‌కు అనుమతి దొరకలేదు. కేవలం శ్వేతజాతీయులకు మాత్రమే ఎంట్రీ అనే నిబంధన ఇందుకు కారణం. దీంతో ఈ రూల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన మిహిర్.. దానిని ఎత్తివేయించడంలో సఫలమయ్యాడు. ఇక తొలుత కలకత్తా హైకోర్టులో క్రిమినల్ లా ప్రాక్టీస్ చేసిన మిహిర్ సేన్.. విజయవంతమైన వ్యాపారవేత్తగానూ రాణించాడు. అయితే, పార్కిన్‌సన్స్ వ్యాధి కారణంగా 66 ఏళ్ల వయసులోనే మిహిర్ సేన్ ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment