ప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించిన భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌కు భారీ ప్రైజ్‌మనీ లభించిన విషయం విదితమే. చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి చాంపియన్ కిరీటాన్ని అందుకున్న ఈ పద్దెమినిదేళ్ల కుర్రాడికి రూ. 11.45 కోట్లు లభించాయి.
అయితే, ఈ భారీ మొత్తంలో దాదాపు రూ. 4. 8 కోట్ల మేర గుకేశ్ టాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చెస్‌లో గుకేశ్ గెలిస్తే.. ఆర్థిక చదరంగంలో మాత్రం భారత ప్రభుత్వం, మంత్రి నిర్మలా సీతారామన్‌దే పైచేయి అంటూ నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
మినహాయింపు ఇవ్వాలి
ఈ నేపథ్యంలో తమిళనాడు ఎంపీ ఆర్. సుధ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఓ లేఖ రాశారు. దేశాన్ని గర్వపడేలా చేసిన గుకేశ్‌కు ఆదాయ పన్ను చెల్లింపులో మినహాయింపు ఇవ్వాలని కోరారు. ‘ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయం’’ అన్న కేటగిరీలో ప్రైజ్‌మనీని చేర్చారన్న సుధ.. జాతిని గర్వించేలా చేసిన వారికైనా పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వాళ్లకు ఇచ్చినట్లే
తద్వారా క్రీడాకారుల్లో నూతనోత్సాహం నిండుతుందని.. క్రీడా రంగ అభివృద్దికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని సుధ తన లేఖలో పేర్కొన్నారు. భారత క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, రవిశాస్త్రిలకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం టాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయాన్ని సుధ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అంతేకాదు.. తమిళనాడు ప్రభుత్వం మాదిరి కేంద్రం కూడా గుకేశ్‌కు క్యాష్ రివార్డు ప్రకటించాలని ఎంపీ సుధ డిమాండ్ చేశారు. అదే విధంగా.. ఈ వరల్డ్ చాంపియన్‌కు జాతీయ అవార్డు కూడా ప్రదానం చేయాలని కోరారు. అత్యంత చిన్న వయసులోనే ప్రపంచ చెస్ చాంపియన్ అయిన గుకేశ్‌ను అభినందిస్తూ లోక్‌సభలో తీర్మానం పెట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ నుంచి ఎంపీగా
కాగా తమిళనాడులోని మయిలదుతురై నియోజకవర్గం నుంచి ఆర్ సుధ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి సభలో అడుగుపెట్టారు. కాగా డాన్ బ్రాడ్‌మన్ సెంచరీల రికార్డు(29)ను సచిన్ టెండుల్కర్ సమం చేసిన సమయంలో నాటి స్పాన్సర్ ఫియట్ కంపెనీ.. అతడికి 75 లక్షల ఫెరారీ కారును బహుమతి ఇచ్చింది. అయితే, దానికోసం కోటికిపైగా టాక్స్ కట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వానికి సచిన్ అర్జీ పెట్టగా పన్ను నుంచి మినహాయింపు లభించినట్లు సమాచారం.
భారీ నజరానా అందజేత
ఇదిలా ఉంటే.. దొమ్మరాజు గుకేశ్‌ను తమిళనాడు ప్రభుత్వం మంగళవారం ఘనంగా సత్కరించింది. అతడికి రూ. 5 కోట్లు నగదు పురస్కారాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి అందజేశారు. అంతకుముందు చెన్నై వీధులలో ఓపెన్ టాప్ వాహనంలో తాను సాధించిన ట్రోఫీతో గుకేశ్ ప్రయాణించాడు.
అనంతరం జరిగిన వేడుకలో తల్లిదండ్రుల సమక్షంలో గుకేశ్‌ను సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి సత్కరించారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ నిలిచిన విశ్వనాథన్ ఆనంద్, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ జె.మేఘనాథరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుకేశ్‌ను సత్కరించిన సీఎం స్టాలిన్ రూ. 5 కోట్ల చెక్‌ను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment