ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 5 వరకు హైదరాబాద్ వేదికగా జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియం స్విమ్మింగ్ కాంప్లెక్స్‌లో జరిగే ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 500 మందికిపైగా స్విమ్మర్లు బరిలోకి దిగనున్నారు.
తెలంగాణ తరఫున 22 మంది స్విమ్మర్లు పోటీపడనుండగా... పురుషుల బృందానికి సూర్యాన్షు, మహిళల బృందానికి వ్రితి అగర్వాల్ నాయకత్వం వహిస్తారు. జాన్ సిద్దిఖి, ఆయూశ్ యాదవ్ కోచ్‌లుగా వ్యవహరిస్తారు. ఒలింపియన్ స్విమ్మర్లు శ్రీహరి నటరాజ్, సజన్ ప్రకాశ్, మానా పటేల్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు.
కేటీ లెడెకీ ఆరోసారి...
అమెరికా మహిళా స్టార్ స్విమ్మర్ కేటీ లెడెకీ వరుసగా ఆరోసారి ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనుంది. గతంలో మైకేల్ ఫెల్ప్స్, రియాన్ లోచ్టె, నటాలీ కులిన్, ఎలిజబెత్ బీసెల్, నాథన్ అడ్రియన్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అమెరికా జాతీయ పోటీల్లో లెడెకీ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. లెడెకీ ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో 7 స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 19 స్వర్ణాలు గెలిచింది.
అల్పైన్ వారియర్స్‌కు ఐదో విజయం
గ్లోబల్ చెస్ లీగ్‌లో ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్‌జీ అలై్పన్ వారియర్స్ జట్టు ఐదో విజయం సాధించింది. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సభ్యుడిగా ఉన్న గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ జట్టుతో దుబాయ్‌లో బుధవారం జరిగిన ఏడో రౌండ్‌లో అలై్పన్ వారియర్స్ 10–8తో గెలిచింది. ఆనంద్‌తో జరిగిన గేమ్‌లో కార్ల్‌సన్ 72 ఎత్తుల్లో నెగ్గాడు. వారియర్స్‌కే చెందిన ప్రజ్ఞానంద 42 ఎత్తుల్లో ఇసిపెంకోను ఓడించగా... అర్జున్, ఎలిజబెత్ పాట్జ్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. గుకేశ్, ఇరీనా ఓడారు.
Comments
Please login to add a commentAdd a comment