ప్యారిస్ పారాలింపిక్స్-2024లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు రిలయన్స్ ఫౌండేషన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సభ్యురాలు నీతా అంబానీ శుభాకాంక్షలు తెలిపారు. మువ్వన్నెల జెండాను పారా విశ్వక్రీడ వేదికపై రెపరెపలాడించినందుకు అభినందించారు. ఈ మేరకు.. ‘‘ప్యారిస్ పారాలింపిక్స్ క్రీడల్లో భారత అథ్లెట్లు దేశాన్ని గర్వపడేలా చేస్తూ ముందుకు సాగుతున్నారు.
నిత్య శివన్, సుమిత్ ఆంటిల్, శీతల్ దేవి, రాకేశ్ కుమార్, సుహాస్ యతిరాజ్, తులసీమతి మురుగేశన్, మనీశా రామదాస్, నితేశ్ కుమార్, యోగేశ్ కతూనియా, నిషద్ కుమార్, ప్రీతిపాల్, రుబీనా ఫ్రాన్సిస్.. అద్బుతమైన ప్రతిభ చూపి పతకాలు సాధించారు. మీ ఈ చిరస్మరణీయ విజయం, అసాధారణ ప్రయాణం అందరికీ ఆదర్శప్రాయం.
మీ ప్రదర్శనతో యావత్ భారతావని గుండెను ఉప్పొంగేలా చేశారు. సంకల్పానికి ఉన్న శక్తిని మరోసారి మాకు చూపించారు. మీరు ఇలాగే కోట్లాదిమందికి స్ఫూర్తిదాతలుగా కొనసాగుతూ.. మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి’’ అని నీతా అంబానీ పతక విజేతలకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ప్యారిస్‌లో మిగిలిన ఈవెంట్లలో పాల్గొనబోయే భారత అథ్లెట్లు కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
కాగా పారాలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా భారత్ టోక్యోలో అత్యధికంగా 19 పతకాలు సాధించింది. ప్యారిస్‌లో ఇక ఇప్పటికే 15 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇందులో మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్యాలు ఉన్నాయి. షూటర్ అవని లేఖరా, బ్యాడ్మింటన్ ప్లేయర్ నితేశ్ కుమార్, జావెలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్ పసిడి పతకాలతో చరిత్ర సృష్టించారు. వీరిని కూడా నీతా ప్రశంసించారు. ఇక 25 మెడల్స్ సాధించాలన్న పట్టుదలతో ప్యారిస్ బరిలోకి దిగిన మన అథ్లెట్లు లక్ష్యం దిశగా దూసుకుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment