
న్యూఢిల్లీ: దేశ క్రీడా పరిపాలన వ్యవస్థను సమూలంగా మార్చడంతో పాటు... క్రీడా రంగానికి మరింత చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జాతీయ క్రీడా పాలన చట్టం–2025’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో బిల్లు చట్టంగా మారిందని... ఇది దేశ క్రీడారంగంలో విప్లవాత్మక సంస్కరణ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ‘ఆగస్టు 18న జాతీయ క్రీడా పాలన చట్టం–2025కు రాష్ట్రపతి ఆమోదం లభించింది’ అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గత నెల 23న ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా... ఈ నెల 11న ఆమోదం పొందింది. ఈ నెల 12న రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లుకు కొన్ని సవరణల అనంతరం ఉభయసభలు ఆమోదించాయి. దీంతో ప్రభుత్వ నిధులపై ఆధారపడే క్రీడా సంస్థలు మాత్రమే సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి రానున్నాయి. మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆర్టీఐ పరిధిలోకి రాదు.