ఆమోదం
► జల్లికట్టు ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర
► జల్లికట్టు అభిమానుల ఆనందహేల
► ‘అల్లరి’ పోలీసులపై వేటు
► అల్లర్ల వెనుక కుట్ర : విపక్షాల ఆగ్రహం
తమిళనాడు ప్రజలకు దేశ రాజధాని నుంచి సోమవారం శుభవార్త అందింది. ఈ శుభవార్త చెవిన పడగానే రాష్ట్ర ప్రజలు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. జల్లికట్టును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం ఆమోదముద్ర వేయడమే ప్రజల ఆనందానికి కారణం.
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళుల ప్రాచీన సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై కొన్నేళ్ల క్రితం విధింపబడిన నిషేధం రాష్ట్ర ప్రజలను తీరని ఆవేదనకు గురిచేసింది. ఆవేదన ఆగ్రహంగా మారి ఆం దోళనలకు దారితీసింది. మూడేళ్లుగా పొంగల్ పండుగ సమయాల్లో జల్లికట్టు ఆందోళనలు సాగుతూ చల్లారిపోతున్నాయి. అయితే ఈ ఏడాది జల్లికట్టు ఉద్యమంలోకి క్రీడాకారులు, అభిమానులేగాక విద్యార్థినీవిద్యార్థులు సైతం రంగప్రవేశం చేశారు. దీంతో చెన్నై మెరీనా బీచ్ తీరమే వేదికగా చేసుకుని సాగించిన ఆందోళనలు ఆకాశాన్ని అంటాయి. తమ డిమాండ్‌ను సాధించేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని జల్లికట్టుపై పట్టుపట్టారు. భార్యా పిల్లలతో కుటుంబాలు సైతం మెరీనాతీరానికి తరలిరాగా ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సీఎం పన్నీర్‌సెల్వం స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. జల్లికట్టు ఉద్యమంపై అడ్డంకులను తొలగిస్తూ ఈ నెల 22వ తేదీన ఆర్డినెన్స్ తీసుకువచ్చారు.
అయితే ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించేవరకు ఆందోళన విరమించబోమని ఉద్యమకారులు స్పష్టం చేశారు. అదే రోజు రాత్రి విద్యార్థి సంఘాల నేతలతో మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆందోళనను విరమింపజేసేందుకు 23వ తేదీ తెల్లవారుజామున పోలీసు ఉన్నతాధికారులు తమవంతు ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తూ పోలీసులు, ఉద్యమకారుల మధ్య చర్చలు బెడిసికొట్టాయి. పోలీసులపై రాళ్లు రువ్వడంతో ప్రారంభమై లాఠీచార్జీ, భాష్పవాయి ప్రయోగాలు, గాలిలోకి కాల్పులు, పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ, ప్రయివేటు వాహనాల దగ్ధం తదితర అవాంఛనీయ సంఘటనలవైపు ఉద్యమం మళ్లింది.
చెన్నై మెరీనాతీరంలోని కొందరు ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లకు కారణమైన మరికొందరిని జైళ్లలోకి నెట్టారు. ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపగా జల్లికట్టు ఉద్యమకారులు ఇంటి బాట పట్టారు. అల్లర్ల సమయంలోనే జల్లికట్టు ఆర్డినెన్స్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ద్వారా రాష్ట్రపతికి చేరుకుంది. అలాగే ఆర్డినెన్స్ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అసెంబ్లీ తీర్మానం కాపీని సైతం రాష్ట్రపతికి పంపారు. దీంతో జల్లికట్టు ఉద్యమానికి మార్గం సుగమం చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం ఆమోదముద్ర వేయడంతో కథ సుఖాంతమైంది.
‘అల్లరి’ పోలీసులపై త్వరలో వేటు
జల్లికట్టు అల్లర్లను అవకాశంగా తీసుకుని అక్రమాలకు పాల్పడిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడనున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీన చెన్నై నగరంలో పలు విధ్వంసక చర్యలు చోటుచేసుకోగా వీటిల్లోని 35 సంఘటనలను కొందరు సెల్‌ఫోన్ ద్వారా వీడియోలో చిత్రీకరించి వాట్సాప్‌లో పెట్టారు. రోడ్డు వారగా నిలిపి ఉన్న ఆటోకు ఒక మహిళా కానిస్టేబుల్ నిప్పుపెట్టడం, మరికొందరు పోలీసులు రోడ్లపై నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేయడం వంటి సన్నివేశాలు వాట్సాప్‌ల ద్వారా ప్రసారం కావడం పోలీసు శాఖను అప్రతిష్టపాలు చేసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. వాట్సాప్ దృశ్యాల ద్వారా పోలీసులను గుర్తించారు. వీరందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నారు. నిలిచి ఉన్న ఒక ఆటోకు నిప్పుపెట్టిన మహిళా కానిస్టేబుల్, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసినవారిపై త్వరలో సస్పెన్షన్ వేటు పడనున్నట్లు తెలిసింది.
రెండు వారాలు వాయిదా
చెన్నై మెరీనాతీరంలో అల్లర్ల ఆరోపణలపై అరెస్టయిన వారికి బెయిల్ మంజూరుకు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరో రెండు వారాలు వాయిదా పడింది. జల్లికట్టు ఉద్యమాన్ని విరమించాల్సిందిగా కోరుతూ ఈ నెల 23వ తేదీన పోలీసులు జరిపిన చర్చలకు సమ్మతించని ఉద్యమకారులు అల్లర్లకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అల్లర్ల సమయంలో ప్రాణనష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 280 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయి రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. బదులు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా పోలీస్‌శాఖ చేసిన విజ్ఞప్తిని మన్నించిన న్యాయమూర్తి మహాదేవన్ కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
విపక్షాల ఆగ్రహం
ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమంలో ఉద్రిక్తతలు సృష్టిం చి కుట్రపూరితంగా అణచి వేశారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జల్లికట్టు ఉద్యమంలో ఉద్దేశ పూర్వకంగా పోలీసులే అల్లర్లు సృష్టించారని టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సోమవారం ఆరోపించారు. వారం రోజులపాటూ శాంతియుత వాతావరణంలో ఉద్యమం చేస్తున్న వారిని చెదరగొట్టే ఉద్దేశంతోనే పోలీసులు రంగ ప్రవేశం చేశారని ఆయన అన్నారు. పోలీసుల జోక్యానికి నిరసనగా ఉద్యమకారులు సముద్రతీరంలోకి వెళ్లగా వారికి రక్షణగా నిలిచిన మత్స్యకారులను సైతం అరెస్ట్ చేయడం అన్యాయమని చెప్పారు. 23వ తేదీ జరిగిన అల్లర్లపై న్యాయ విచారణ జరపాలని ఆయన కోరారు. జల్లికట్టు ఉద్యమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంపై పార్లమెంటులో గళం విప్పుతానని రాజ్యసభ సభ్యురాలు (డీఎంకే) కనిమొళి సోమవారం తెలిపారు.