ముంబై రంజీ జట్టు నుంచీ స్థానం కోల్పోయిన భారత క్రికెటర్
ఫిట్‌గా లేకపోవడం, అనుచిత ప్రవర్తనే కారణాలు
ముంబై: భారత జట్టు మాజీ సభ్యుడు, టాపార్డర్ బ్యాటర్ పృథ్వీ షాను ముంబై రంజీ జట్టు నుంచి తప్పించారు. ఫామ్‌లో లేకపోవడం, ఫిట్‌నెస్ సమస్యలు, అనుచిత ప్రవర్తన కారణంగా అతనిపై వేటు పడింది. టీమిండియా ఓపెనర్‌గా అంతర్జాతీయ కెరీర్‌లో ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడిన 24 ఏళ్ల పృథ్వీ ఇటీవలి కాలంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం కూడా ముంబై సెలక్టర్ల ఆగ్రహానికి కారణమైంది.
తరచూ జట్టు ట్రెయినింగ్ సెషన్‌లకు డుమ్మా కొట్టడంతో పాటు బరువు పెరిగి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను కోల్పోవడంతో అతనికి ఉద్వాసన పలికారు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 7, 12, 1, 39 నాటౌట్ స్కోర్లు చేశాడు. ఫిట్‌నెస్ సమస్యలతో ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా స్పందించడం లేదు. దీంతో అతన్ని తప్పించి 29 ఏళ్ల ఎడంచేతి ఓపెనింగ్ బ్యాటర్ అఖిల్ హేర్వడ్కర్‌ను ముంబై జట్టులోకి తీసుకున్నారు.
అతను 41 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 36.51 సగటు నమోదు చేశాడు. ఏడు సెంచరీలు, పది అర్ధసెంచరీలు బాదాడు. ముంబై తదుపరి మ్యాచ్‌ను త్రిపురతో ఆడనుంది. అగర్తలాలో ఈ నెల 26 నుంచి 29 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత టి20 కెపె్టన్, మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment