
Pro Kabaddi League 2024: ఎదురులేని హర్యానా స్టీలర్స్
Published Mon, Oct 28 2024 10:30 PM | Last Updated on Tue, Oct 29 2024 11:00 AM

దబంగ్ ఢిల్లీపై 41-34తో ఘన విజయం
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11
హైదరాబాద్, 28 అక్టోబర్ 2024 : గత సీజన్ ఫైనలిస్ట్ హర్యానా స్టీలర్స్ అదరగొట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీపై హర్యానా స్టీలర్స్ పంజా విసిరింది. 41-34తో తిరుగులేని ప్రదర్శన చేసిన హర్యానా స్టీలర్స్ ఏడు పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ మహ్మద్‌రెజా (10 పాయింట్లు) సూపర్‌టెన్ షోతో మెరువగా.. శివమ్ (8 పాయింట్లు), జైదీప్ (5 పాయింట్లు) రాణించారు.దబంగ్ ఢిల్లీ తరఫున ఆషు మాలిక్ (13 పాయింట్లు), వినయ్ వీరేందర్ (8 పాయింట్లు) పోరాడినా ఫలితం దక్కలేదు. నాలుగు మ్యాచుల్లో దబంగ్ ఢిల్లీకి ఇది రెండో పరాజయం కాగా.. మూడు మ్యాచుల్లో హర్యానా స్టీలర్స్‌కు ఇది రెండో విజయం.
స్టీలర్స్ దూకుడు : దబంగ్ ఢిల్లీతో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ ఆరంభం నుంచీ దూకుడు చూపించింది. రెయిడింగ్‌లో, ట్యాకిల్స్‌లో ఆధిపత్యం చూపించింది. ప్రథమార్థంలోనే దబంగ్ ఢిల్లీ కోర్టును ఖాళీ చేసిన హర్యానా స్టీలర్స్ విలువైన ఆలౌట్ పాయింట్లు సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్ మహ్మద్‌రెజా, రెయిడర్ శివం, డిఫెండర్ జైదీప్ అంచనాలను అందుకున్నారు. ఇదే సమయంలో దబంగ్ ఢిల్లీ పాయింట్ల వేటలో తేలిపోయింది. కూతకెళ్లిన రెయిడర్లు నిరాశపర్చటం, ట్యాకిల్స్‌లో డిఫెండర్ల తడబాటు ప్రతికూలంగా మారాయి. తొలి 20 నిమిషాల ఆట ముగిసేసరికి హర్యానా స్టీలర్స్ ఏకంగా 11 పాయింట్ల ఆధిక్యం సాధించింది. 24-13తో ఏకపక్ష ప్రదర్శన చేసిన హర్యానా స్టీలర్స్ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది.
దబంగ్ ఢిల్లీ పోరాడినా.. : ద్వితీయార్థంలో దబంగ్ ఢిల్లీ ప్రదర్శన కాస్త మెరుగైనా.. హర్యానా స్టీలర్స్‌కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఆ జట్టు పాయింట్లు సాధించలేదు. ప్రథమార్థంలో 11 పాయింట్ల లోటు భారీగా ఉండటంతో.. విరామం తర్వాత హర్యానా కంటే అధికంగా పాయింట్లు సొంతం చేసుకున్నా ప్రయోజనం లేకపోయింది. దబంగ్ ఢిల్లీ రెయిడర్ ఆషు మాలిక్ సూపర్ టెన్ ప్రదర్శనతో మెరువగా.. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన వినయ్ కూతకెళ్లి ఖతర్నాక్ షో చేశాడు. ఆషు మాలిక్, వినయ్ మెరువటంతో దబంగ్ ఢిల్లీ ఆఖరు వరకు పట్టు విడువలేదు. హర్యానా స్టీలర్స్ జోరు తగ్గినా.. ఆధిక్యం మాత్రం చేజార్చుకోలేదు. కీలక సమయంలో పాయింట్లు సాధించి ఎప్పటికప్పుడు పైచేయి నిలుపుకుంది. ద్వితీయార్థంలో దబంగ్ ఢిల్లీ 21 పాయింట్లు సాధించగా.. హర్యానా స్టీలర్స్ 17 పాయింట్లు మాత్రమే సాధించింది.
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment