ప్రొ కబడ్డీ లీగ్ విజేత పుణేరీ పల్టన్
తొలిసారి చాంపియన్‌గా నిలిచిన జట్టు
ఫైనల్లో హరియాణా స్టీలర్స్‌పై గెలుపు
అద్భుతమైన ఆటతో లీగ్ దశలో అగ్ర స్థానం... 22 మ్యాచ్‌లలో 17 విజయాలు... స్కోరు తేడాలో ఎవరికీ అందనంత ఎత్తులో ముందంజ... ఈ సీజన్‌లో ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన పుణేరీ పల్టన్ తమ జోరును తగ్గించకుండా అసలు పోరులోనూ సత్తా చాటి తమ స్థాయిని ప్రదర్శించింది...
గత సీజన్‌లో త్రుటిలో చేజారిన ట్రోఫీని ఈసారి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా ఒడిసి పట్టుకుంది... ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో తొలిసారి చాంపియన్‌గా సగర్వంగా నిలిచింది. మొదటిసారి ఫైనల్ చేరిన హరియాణా స్టీలర్స్ ఆరంభంలో ఆకట్టుకున్నా... ఒత్తిడిలో తలవంచి రన్నరప్‌కే పరిమితమైంది.
సాక్షి, హైదరాబాద్: కబడ్డీ అభిమానులను 91 రోజుల పాటు అలరించిన ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ అట్టహాసంగా ముగిసింది. అన్ని విధాలా ఆధిపత్యం ప్రదర్శించిన పుణేరీ పల్టన్ మొదటిసారి లీగ్ చాంపియన్‌గా అవతరించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఆసక్తికరంగా జరిగిన ఫైనల్లో పల్టన్ 28–25 పాయింట్ల తేడాతో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. తొలి అర్ధ భాగం ముగిసేసరికి 13–10తో ఆధిక్యంలో నిలిచిన పల్టన్ బలమైన డిఫెన్స్‌తో చివరి వరకు దానిని నిలబెట్టుకోవడంలో సఫలమైంది. గత సీజన్ ఫైనల్లో ఓడిన పుణేరీ వరుసగా రెండోసారి తుది పోరుకు అర్హత సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
మ్యాచ్‌లో ఇరు జట్లు ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్స్‌కే ప్రాధాన్యతనిచ్చాయి. ఫలితంగా తొలి 10 నిమిషాల్లోనే 13 ఎంప్టీ రైడ్‌లు వచ్చాయి. ప్రతీ పాయింట్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... ఒకదశలో పుణేరీ 9–7తో స్వల్ప ఆధిక్యంలోనే ఉంది. అయితే ఈ దశలో 19వ నిమిషంలో పంకజ్ మోహితే డు ఆర్ డై రెయిడ్ మ్యాచ్ దిశను మార్చింది. ఒకేసారి 4 పాయింట్లు సాధించి అతను పుణేను ముందంజలో నిలిపాడు. ఆ తర్వాత ఈ అంతరాన్ని తగ్గించడంలో స్టీలర్స్ విఫలమైంది. 23వ నిమిషంలో స్టీలర్స్‌ను పల్టన్ జట్టు ఆలౌట్ కూడా చేయడంతో ఆట పూర్తిగా వారివైపు మొగ్గింది.
చివరి పది నిమిషాల్లో హరియాణా పుంజుకున్నా అది విజయానికి సరిపోలేదు. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లూ 15 పాయింట్లు చొప్పున సమానంగా స్కోరు చేసినా... తొలి అర్ధ భాగంలో వెనుకబడిన 3 పాయింట్లే చివరకు స్టీలర్స్ ఓటమికి కారణమయ్యాయి. పల్టన్ తరఫున పంకజ్ మోహితే 9 పాయింట్లు సాధించగా... మోహిత్ 5, కెప్టెన్ అస్లమ్ 4 పాయింట్లు సాధించారు. స్టీలర్స్ ఆటగాళ్లలో అత్యధికంగా శివమ్ 6, సిద్ధార్థ్ దేశాయ్ 4 పాయింట్లు స్కోరు చేశారు. విజేతగా నిలిచిన పుణేరీ జట్టుకు రూ. 3 కోట్లు, రన్నరప్ హరియాణా జట్టుకు రూ. 1 కోటీ 80 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విజేత జట్టుకు ట్రోఫీని అందజేశాడు.
Comments
Please login to add a commentAdd a comment