బర్మింగ్‌హామ్: భారత సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పూసర్ల వెంకట సింధు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ముందంజ వేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 2015 రన్నరప్ సైనా నెహ్వాల్ 21–17, 21–19తో బియట్రిజ్ కొరలెస్ (స్పెయిన్)పై గెలుపొందగా, ఆరో సీడ్ పీవీ సింధు 21–18, 21–13తో చైనా ప్రత్యర్థి వాంగ్జీ యిపై అలవోక విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది.
భమిడిపాటి సాయిప్రణీత్‌కు తొలి రౌండ్లోనే ప్రపంచ నంబర్‌వన్, ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో చుక్కెదురైంది. తొలి గేమ్‌లో చక్కని పోరాటపటిమ కనబరిచిన సాయిప్రణీత్ రెండో గేమ్‌లో చతికిలబడ్డాడు. చివరకు 20–22, 11–21తో అక్సెల్సన్ ధాటికి ఓటమి పాల య్యాడు. సమీర్ వర్మ 18–21, 11–21తో మార్క్ కాల్జౌ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోగా... థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవుత్ వితిద్సర్న్ 21–15, 24–22తో హెచ్.ఎస్.ప్రణయ్‌పై గెలిచాడు.
గాయత్రి జోడీ శుభారంభం
డబుల్స్ పోటీల్లోనూ భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీలు శుభారంభం చేశాయి. గాయత్రి–ట్రెసా జంట 17–21, 22–20, 21–14తో బెన్యప ఎయిమ్సర్డ్–నుంతకర్న్ ఎయిమ్సర్డ్ (థాయ్‌లాండ్) జోడీపై, ఐదో సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–19తో అలెగ్జాండర్ డున్–ఆడమ్ హల్ (స్కాట్లాండ్) జంటపై గెలుపొందాయి. అయితే సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 9–21, 13–21తో రిన్ ఇవానగ–కీ నకనిషి (జపాన్) జంట చేతిలో కంగుతింది. గారగ కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ జోడీ 16–21, 19–21తో మార్క్ లామ్స్‌ఫుజ్–మార్విన్ సీడెల్ (జర్మనీ) ద్వయం చేతిలో, అర్జున్–ధ్రువ్ కపిల జోడీ 21–15, 12–21, 18–21తో రెండో సీడ్ మొహమ్మద్ ఎహ్‌సాన్–హెండ్రా సెతియవాన్ (ఇండోనేసియా) జంట చేతిలో పరాజయం చవిచూశాయి.
Comments
Please login to add a commentAdd a comment