న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ)అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ మూడోసారి ఎన్నికయ్యాడు. తాజా ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్‌పై రోహన్ జైట్లీ విజయం సాధించాడు. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన రోహన్ డీడీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం.
డీడీసీఏలో మొత్తం 3,748 ఓట్లకు గానూ... 2,413 మంది ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయానికి 1207 ఓట్లు అవసరం కాగా... 35 ఏళ్ల రోహన్ జైట్లీ 1,577 ఓట్లతో ఘన విజయం సాధించాడు. 1983లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్‌కు 777 ఓట్లు వచ్చాయి.
రోహన్ జైట్లీ తండ్రి దివంగత అరుణ్ జైట్లీ గతంలో 14 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా కొనసాగారు. 2020లో రజత్ శర్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో తొలిసారి డీడీసీఏ అధ్యక్షుడిగా ఏకగీవ్రంగా ఎన్నికైన రోహన్ జైట్లీ... ఏడాది తర్వాత జరిగిన ఎన్నికల్లో వికాస్ సింగ్‌పై విజయం సాధించి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
బీసీసీఐ మాజీ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సహకారంతో రోహన్ సులువుగా ఈ ఎన్నికల్లో విజయం సాధించాడు. సీకే ఖన్నా కూతురు శిఖా తాజా ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఘనవిజయం సాధించింది. కార్యదర్శిగా అశోక్ శర్మ, కోశాధికారిగా హరీశ్ సింగ్లా జాయింట్ సెక్రటరీగా అమిత్ గ్రోవర్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం మూడేళ్ల పాటు కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment