'ఇక ఆ చర్చలు అనవసరం.. టీమిండియా రాకపోయినా పర్వాలేదు' | Saqlain Mushtaq Opines On India Not Travelling To Pakistan For Champions Trophy | Sakshi
Sakshi News home page

Champions Trophy: 'ఇక ఆ చర్చలు అనవసరం.. టీమిండియా రాకపోయినా పర్వాలేదు'

Published Sat, Aug 3 2024 4:59 PM | Last Updated on Sat, Aug 3 2024 5:15 PM

 Saqlain Mushtaq Opines On India Not Travelling To Pakistan For Champions Trophy

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భార‌త జ‌ట్టు పాల్గోంటుందా లేదా అన్న విషయంపై ఇంకా సందిగ్ధం నెలకొంది. అందుకు కార‌ణం ఈ మెగా ఈవెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్య‌మిస్తుండడ‌మే. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు పాకిస్తాన్‌కు భార‌త జ‌ట్టును  పంపేందుకు బీసీసీఐ నిరాక‌రించింది. 

ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న రాజకీయ ఉద్రిక్త‌లు, ఆట‌గాళ్ల భ‌ద్ర‌త దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆసియాకప్ మాదిరిగానే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే తమ నిర్ణయాన్ని ఐసీసీకి బీసీసీఐ తెలియజేసింది. 

మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం టోర్నీ మొత్తం తమ దేశంలోనే జరగాలన్న మొండి పట్టుతో ఉంది. పాక్ మాజీ క్రికెటర్లు సైతం భారత జట్టు తమ దేశానికి వచ్చి ఆడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా ఇదే విషయంపై పాక్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు భారత్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు రాకపోతే తమకు ఎటువం‍టి నష్టం లేదని సక్లైన్ ముస్తాక్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

"భారత జట్టు పాకిస్తాన్‌కు వస్తుందా లేదా అన్న చర్చలు అనవసరం. అది వారి ఇష్టం. వస్తే వచ్చారు లేదంటే లేదు. భారత్ మా దేశానికి వచ్చినా రాకపోయినా మాకు ఎటువంటి నష్టం లేదు. ఇది మాకే కాదు భారత్‌కు కూడా వర్తిస్తుంది.

భారత్ మాత్రమే కాదు ఏ జట్టు మా దేశానికి వచ్చినా మేము స్వాగతిస్తాము. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ)కు సంబంధిం‍చిన ఈవెంట్‌. కాబట్టి ఈ విషయాన్ని ఐసీసీనే చూసుకుంటుంది" అని పాకిస్తాన్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్తాక్ పేర్కొన్నాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement