
తొట్టతొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా సంచలన ప్రదర్శనలతో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. ఇవాళ (జనవరి 29) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో, తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 68 పరుగులకే చాపచుట్టేసింది. టిటాస్ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వెన్నువిరచగా.. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ చెరో వికెట్ తీసి తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నియామ్ హోలాండ్ (10), ర్యానా మెక్‌డొనాల్డ్ గే (19), అలెక్సా స్టోన్‌హౌస్ (11), సోఫీ స్మేల్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా కూడా ఆరంభంలోనే తడబడుతుంది. 3.4 ఓవర్లలోనే భారత జట్టు ఫామ్‌లో ఉన్న ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 27/2గా ఉంది. షెఫాలీ వర్మ (15), శ్వేత్ సెహ్రావత్ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. హన్నా బేకర్, కెప్టెన్ గ్రేస్ స్కీవెన్స్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment