దుబాయ్: ఐపీఎల్ గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరింది. అయితే ఎక్కువ భాగం విజయాలు ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో జోరు కారణంగానే వచ్చాయి. వీరిద్దరి దూకుడుతో తర్వాతి బ్యాట్స్‌మెన్‌ను ఎక్కువగా అవకాశం రాలేదు. దాంతో కీలక సమయంలో ఒత్తిడికి గురై జట్టు విఫలమైంది. అయితే ఈ సారి లీగ్‌లో ఆ లోపాన్ని అధిగమిస్తామని టీమ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్. అన్నాడు. సీనియర్లు, కుర్రాళ్లతో జట్టు సమతూకంగా ఉందని చెప్పాడు. వివిధ అంశాలపై లక్ష్మణ్ చెప్పిన సమాధానాలు అతని మాటల్లోనే...
కోవిడ్–19 నేపథ్యంలోని పరిస్థితులపై...
బీసీసీఐతో పాటు మా ఫ్రాంచైజీ కూడా రూపొందించిన బయో సెక్యూర్ బబుల్ నిబంధనలు సరైన దిశలో ఉన్నాయి. వాటిని మేమందరం కచ్చితంగా పాటిస్తున్నాం. రిసార్ట్ ఉద్యోగులు, డ్రైవర్ కూడా బబుల్‌లో భాగమే. ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆటగాళ్లకు స్పష్టత ఉంది. ఐదు రోజులకు ఒకసారి కరోనా పరీక్షలకు హాజరవుతున్నాం. ట్రాకర్ కూడా అందరం ధరిస్తున్నాం. అంతకు ముందు భారత్‌నుంచి కూడా చార్టెట్ ఫ్లయిట్‌లోనే భారత ఆటగాళ్లంతా కలిసి వచ్చారు. నిబంధనల ప్రకారమే పరీక్షలకు హాజరయ్యాం. ఇక్కడకి వచ్చాక భోజనం కోసం గానీ ఇతర పనుల కోసం కానీ ఎవరూ ఎవరినీ కలవలేదు. అందరూ నెగిటివ్‌గా తేలిన తర్వాత కూడా అన్ని జాగ్రత్తల మధ్య ప్రాక్టీస్ సెషన్‌లు మొదలయ్యాయి. ఎల్లకాలం బబుల్‌లోనే ఉండటం కొంత కష్టమే అయినా తప్పదు. (చదవండి: వామ్మో రోహిత్.. ఇంత కసి ఉందా!)
సన్‌రైజర్స్ జట్టు లోపాలపై...
గత ఏడాది టాప్–4లో నిలిచాం. వార్నర్, బెయిర్ స్టో చాలా బాగా ఆడారు. అయితే అదే చివరకు మిడిలార్డర్‌కు తగినంత అవకాశం రాకుండా చేసింది. వారు తిరిగి వెళ్లిపోగానే జట్టు బలహీనంగా కనిపించింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే వేలానికి వెళ్లాం. దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభావంతులైన కుర్రాళ్లను ఎంపిక చేసుకున్నాం. ప్రియమ్ గార్గ్, సమద్, విరాట్ సింగ్, సందీప్, సంజయ్ యాదవ్‌లు సత్తా చాటుతారనే నమ్మకం ఉంది. ఈ సారి సీనియర్ మనీశ్ పాండేపై బాధ్యత మరింత పెరిగింది. అతనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. పాండేకు తోడుగా విజయ్ శంకర్ మిడిలార్డర్‌లో ఉన్నాడు. అలాగే విదేశీయుల్లో నబీ, ఫాబియాన్, మార్‡్ష తమ స్థాయికి తగినట్లు ఆడితే మాకు తిరుగుండదు. అన్నింటికి మించి కేన్ విలియమ్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తన నాయకత్వ లక్షణాలతో అతను టీమ్‌కు అదనపు బలం. ఈ సారి కూడా కేన్ కీలక పాత్ర పోషిస్తాడు. మొత్తంగా సీనియర్లు, జూనియర్ల కలయికతో టీమ్ చాలా బాగుంది.
కొత్త కోచింగ్ బృందంపై...
ఈ ఏడాది ట్రెవర్ బెలిస్ కోచ్‌గా వచ్చారు. ఆయనతో కలిసి పని చేయడం చాలా బాగుంది. ఐపీఎల్‌లో కోల్‌కతాకు టైటిల్ అందించిన ఆయన ఇంగ్లండ్‌కు విశ్వ విజేతగా నిలిపారు. ఆటగాళ్లను బెలిస్ సన్నద్ధం చేస్తున్న తీరు అభినందనీయం. అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్‌తో కూడా మంచి అనుబంధం ఉంది. సుదీర్ఘ కాలంగా హాడిన్ నాకు తెలుసు. వీరంతా జట్టును గొప్పగా తీర్చి దిద్దుతుండటం చూస్తే సంతోషంగా అనిపిస్తోంది.
ప్రేక్షకులు లేకపోవడం...
బయటి అంశాల అవసరం లేకుండా తమంతట తాము స్ఫూర్తి పొందడం అగ్రశ్రేణి ఆటగాళ్ల లక్షణం. స్టేడియంలో ప్రేక్షకుల వల్ల ఉత్సాహం పెరుగుతుందనేది వాస్తవమే అయినా...గొప్ప ఆటగాళ్లు పరిస్థితులకు తొందరగా అలవాటు పడతారు కూడా. ఇంగ్లండ్‌లో కూడా ఆటగాళ్లంతా ఇటీవలి సిరీస్‌లలో అభిమానులు లేకుండానే బాగా ఆడగలమని నిరూపించారు. ఎదురుగా కనిపించకపోయినా తమను లక్షలాది మంది వీక్షిస్తున్నారనే విషయం వారికి కూడా తెలుసు. ప్రేక్షకులు లేరనే కారణంగా ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీ స్థాయి, నాణ్యత తగ్గవు. అయినా ఇంత సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి దిగడమే ఆటగాళ్లకు ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. వారంతా ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment