
విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి... ఈ టీమిండియా స్టార్ బ్యాటర్ అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశాక భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లన్నింటిలో తనే టాప్ స్కోరర్. 2012లో.. 78 నాటౌట్... 2014లో 36 నాటౌట్.. 2016లో 55 నాటౌట్.. 2021లో 57.. 2022లో 82 నాటౌట్ పరుగులు సాధించాడు.
తద్వారా ఆయా మ్యాచ్‌లలో తనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. అయితే, వరల్డ్‌కప్-2024లో మరోసారి చిరకాల ప్రత్యర్థితో పోటీ సందర్భంగా కోహ్లి జైత్రయాత్రకు బ్రేక్ పడింది. న్యూయార్క్ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన కోహ్లి.. మూడు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేశాడు.
నసీం షా బౌలింగ్‌లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లితో పాటు కెప్టెన్, మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా నిరాశపరిచాడు. 12 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ కేవలం 13 పరుగులే చేసి నిష్క్రమించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపునకు ప్రధాన కారణం వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.
పంత్ 31 బంతుల్లో 42 పరుగులతో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించగా.. బుమ్రా తన అద్బుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్(3/14) చేస్తూ పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘విరాట్.. ఇంకా అతడి బృందం వెనుక భారత మీడియా పరిగెడుతూ ఉంటే.. జస్‌ప్రీత్ బుమ్రా సైలెంట్‌గా ఒంటిచేత్తో టీమిండియాను గెలిపిస్తున్నాడు.
నిజానికి టీమిండియాలో ఉన్న, కొనసాగుతున్న అత్యుత్తమ ఆటగాడు అతడు ఒక్కడే’’ అని మంజ్రేకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అయితే, ఇందుకు స్పందించిన కోహ్లి అభిమానులు ఈ మాజీ ఆటగాడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
‘‘బుమ్రాను ప్రశంసించాలంటే అతడి పేరును ప్రస్తావిస్తే చాలు. కానీ.. మీరు మీ పోస్టు అందరినీ ఆకర్షించాలనే ఉద్దేశంతో కోహ్లి పేరును ప్రస్తావించారు. నిజానికి మీలాంటి వాళ్లు కోహ్లిని ఏదో ఒకటి అని ప్రచారం పొందాలని చూస్తారు’’ అంటూ సంజయ్ మంజ్రేకర్‌పై ఫైర్ అవుతున్నారు.