కూటమి టార్గెట్‌ కాకాణి | - | Sakshi
Sakshi News home page

కూటమి టార్గెట్‌ కాకాణి

Mar 26 2025 12:51 AM | Updated on Mar 26 2025 12:46 AM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. ఆ పార్టీ వైఫల్యాలను, తప్పుడు ప్రచారాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ను కట్టడి చేయాలని ఉద్దేశంతో తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తోంది.

కాకాణిపై ఎప్పుడెప్పుడు కేసులు

● గతేడాది గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెడితే ఆ వార్తను ‘సాక్షి’ కవర్‌ చేసింది. ఆ పేపర్‌ కటింగ్‌ను తన వాట్సాప్‌ గ్రూపుల్లో ఫార్వర్డ్‌ చేశాడని వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.

● వెంకటాచలం మండలానికి చెందిన బీజేపీ నేత నెల్లూరులో ప్రెస్‌మీట్‌ పెడితే ఆ వీడియో కాకాణి వాట్సాప్‌ గ్రూపుల్లో ఫార్వర్డ్‌ చేశాడని మరో కేసు పెట్టారు.

● స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అసభ్యకరంగా పోస్టింగ్‌ పెట్టాడని ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు.

● గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయకపోవడంతో భవన కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి వారికి సంఘీభావంగా వెళ్లి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆయనపై కేసు నమోదు చేశారు.

● గతేడాది డిసెంబర్‌లో వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. పోలీసుల తీరుపై కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంకటాచలానికి చెందిన టీడీపీ కార్యకర్త నెల్లూరు వేదాయపాళెం పోలీసులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు.

● కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం కోళ్లదిన్నెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. గాయపడిన వారిని పరామర్శించిన కాకాణి అక్కడ మీడియాతో మాట్లా డుతూ పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టి తప్పు చేసిన అధికారులు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించిందని టీడీపీ కార్యకర్త కావలి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

● తాజాగా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్‌లో గత ప్రభుత్వ హయాంలో అనధికారికంగా మైనింగ్‌ చేసి క్వార్ట్‌ ్జ మెటల్‌ను తరలించారని, అందుకు కాకాణి తన అనుచరులకు సహకరించారనే కారణం చూపి ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో వారి రిమాండ్‌ రిపోర్టులో ఎక్కడా కూడా కాకాణి పాత్ర ఉన్నట్లు ధ్రువపరచలేదు. తాము ఆయన అనుచరులమని, మైనింగ్‌, పోలీస్‌, రెవెన్యూ అధికారులను మేనేజ్‌ చేస్తామని చెప్పడంతోనే అక్రమ మైనింగ్‌ చేసినట్లు చూపి నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా పోలీసుల కల్పితమే కానీ, ఎక్కడా వీరి పాత్ర కానీ, కాకాణి పాత్ర ఎక్కడా లేకపోవడం గమనార్హం.

ఎవరో ఫిర్యాదు ఇస్తే కేసులా?

మాజీ మంత్రి కాకాణి ప్రతి నిత్యం ప్రభుత్వ వైఫల్యాలపైన, సర్వేపల్లిలో జరిగే అవినీతి, అక్రమాలను ఎండ గడుతున్నారు. ఇది రుచించని ప్రభుత్వ పెద్దలతోపాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి తమ అనుచర వర్గాలతో ఫిర్యాదులు చేయిస్తూ కేసులు నమోదు చేయిస్తున్నారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు సైతం ఫిర్యాదు వచ్చిందే తడువుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. ఏ కేసులో కూడా బాధిత వర్గాలు ఫిర్యాదులు చేయలేదు. టీడీపీ కార్యకర్తలు ఇచ్చే ఫిర్యాదే ప్రామాణికంగా తీసుకుని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తూ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు 16 విచారణలు

గత ప్రభుత్వ హయాంలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు విజిలెన్స్‌ విచారణలు చేయించారు. ఇప్పటికి 16 పర్యాయాలు విజిలెన్స్‌ అధికారులు విచారణ చేసి అవినీతి జరగలేదని తేల్చి చెప్పారు. దీంతో ఎలాగైనా కాకాణిని జైలుకు పంపేలా ప్రభుత్వ పెద్దలు చేయని ప్రయత్నాలు లేవు. తాజాగా ఒంగోలుకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారితో సిట్‌ ఏర్పాటు చేసి విచారణలు చేస్తున్నారు.

కేసులకు భయపడేది లేదు

అక్రమ మైనింగ్‌కు సహకరించారని తాజాగా కేసు

ఇప్పటికే 16 విచారణలు.. 8 కేసులు

అవినీతి జరగలేదని తేల్చి చెప్పిన

విజిలెన్స్‌

అయినా సిట్‌ వేసి అక్రమ కేసులతో వేధింపులు

నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లతో

అరెస్ట్‌కు రంగం సిద్ధం

ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే

లేదంటున్న కాకాణి

నెల్లూరు పోలీసులు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని రెడ్‌బుక్‌ కుట్రలో భాగంగా జైలుకు పంపేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. పొదలకూరు మండలం తాటిపర్తిలోని ‘రుస్తుం మైన్స్‌లో’ అక్రమ మైనింగ్‌ జరిగిందంటూ అందులో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, వారికి ఆయన సహకరించారంటూ నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లతో కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలోనే స్థానిక ఎమ్మెల్యే చేసిన ఆరోపణలతో చేపట్టిన విజిలెన్స్‌ విచారణలో అసలు అక్కడ మైనింగే జరగలేదంటూ నివేదిక ఇచ్చినా.. తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు.

తాను కేసులకు భయపడి ప్రశ్నించే విధానాన్ని మాత్రం మానుకోను. ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎండగడుతూనే ఉంటా. కూటమి ప్రభుత్వ ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 8 కేసులు నమోదు చేశారు. క్వార్ట్‌ ్జ కేసులో నన్ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. నన్ను ఎన్నిసార్లు అరెస్ట్‌ చేసినా ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం పశ్నిస్తూనే ఉంటా. సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతిని బయట పెడుతూనే ఉంటా. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించను. మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో మా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం. అందుకే ఎన్ని కేసులు నమోదైనా జంకే ప్రసక్తేలేదు.

– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement