
తల్లీబిడ్డలపై మమకారం చూపాలి
నెల్లూరు రూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలు పొందుతున్న తల్లీబిడ్డలపై మమకారం, వాత్సల్యం చూపాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై కలెక్టర్ ఆనంద్‌తో కలిసి కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయ్‌లెట్ల నిర్వహణలో పురోగతి చూపాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సుపోషిత్ పంచాయతీల్లో నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలను కల్పిస్తే వాటికి గుర్తింపుతో పాటు రూ.లక్ష పారితోషికం లభించనుందని చెప్పారు. గర్భిణులకు నిర్దేశించిన పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలని ఆదేశించారు. పాఠశాల డ్రాపౌట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కనీసం పదో తరగతి పూర్తిచేసేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గృహ హింస చట్టాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు.
ఆత్మసంతృప్తితో పనిచేయండి
అంగన్‌వాడీ కార్యకర్తలు ఆత్మ సంతృప్తితో పనిచేయాలని కలెక్టర్ ఆనంద్ కోరారు. పిల్లల ఎత్తు, బరువును ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఉదయగిరి కళాకారులతో ప్రత్యేకంగా తయారు చేయించిన చెక్క ఆట వస్తువులను ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి తిలకించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్ కోరారు. అనంతరం బాలల న్యాయచట్టం పోస్టర్లను ఆవిష్కరించారు. కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, ఐసీడీఎస్ ఆర్జేడీ జయలక్ష్మి, పీడీ నిర్మలాదేవి, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, ఆర్డీఓలు అనూష, పావని, వంశీకృష్ణ, డీఎస్పీ సింధుప్రియ, హౌసింగ్ పీడీ వేణుగోపాల్ తదితరులు పాలొన్నారు.
రాపూరులో రూ.1.41 కోట్ల దుర్వినియోగం
నెల్లూరు (పొగతోట): రాపూరు మండలంలో సంఘబంధం, పొదుపు సంఘాల సభ్యులకు తెలియకుండా రూ.1.41 కోట్లను దుర్వినియోగం చేశారని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో రూ.57 లక్షలను రికవరీ కింద జమ చేశామన్నారు. రూ.84 లక్షలను రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. దీనికి సంబంధించి ఏడుగురు సిబ్బందిపై చర్యలకు నిర్దేశించామని, వివరణ అనంతరం తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.