నిబంధనలు ఉల్లంఘించే వాహనాదారులపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘించే వాహనాదారులపై చర్యలు

Published Sat, Apr 29 2023 5:40 AM | Last Updated on Sat, Apr 29 2023 11:21 AM

- - Sakshi

సాక్షి, పుట్టపర్తి: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఈ–చలానాను రిజిష్టర్‌ మొబైల్‌ నంబరుకు పంపిస్తున్నారు. అంతేకాకుండా పదేపదే పట్టుబడిన వారికి కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నారు. వారాంతపు రోజుల్లో డ్రంకర్‌ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి.

నెలాఖరులో ప్రత్యేక డ్రైవ్‌..
వాహనదారులు రోడ్లపైకి వచ్చి నిబంధనలు పాటించకుండా తిరగడం. లైసెన్సు లేకుండా వాహనం నడపడం. హెల్మెట్‌ లేకుండా టూవీలర్‌, సీటు బెల్టు పెట్టుకోకుండా ఫోర్‌ వీలర్‌ డ్రైవ్‌ చేస్తున్నారు. అయితే వాహనం ఆపితే కానీ లైసెన్సు ఉందో లేదో తెలీదు.. కానీ హెల్మెట్‌, సీటు బెల్టు విషయంలో సీసీ కెమెరాల ఆధారంగా పట్టేస్తున్నారు. దీనికి తోడు ప్రతి నెలా చివరి వారంలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో మైనర్లు కూడా వాహనాలు నడుపుతూ బుక్‌ అవుతుండటం విశేషం.

ప్రధాన రహదారులపై అధికం..
జాతీయ రహదారులతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. లైసెన్సులు లేని వారికి.. మద్యం తాగి వాహనం నడిపే వారికి జరిమానా విధిస్తున్నారు. ఫలితంగా రోడ్లపై విచ్చలవిడిగా వీరవిహారం చేద్దామనుకునే వారి బండ్లకు బ్రేకులు పడుతున్నాయి.

నిబంధనలు పాటిస్తేనే..
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే.. రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసే అవకాశం ఉంటుంది. సురక్షితమైన ప్రయాణమే పోలీసుల లక్ష్యం. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి.. ఆయా ప్రమాదాలకు గల కారణాలపై అధ్యయనం చేస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధిస్తున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈసారి తగ్గినట్లు పోలీసులు చెబుతున్నారు.

జాగ్రత్తలు పాటించాల్సిందే..
ఎవరైనా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయా పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, మెయిన్‌ రోడ్డు జంక్షన్లలో అమర్చిన సీసీ కెమెరాలు పట్టేస్తాయి. ఫలితంగా ఈ–చలానా ఇంటికి వస్తుంది. వాహన నంబరు పరిశీలిస్తే గతంలో విధించిన జరిమానాలు కూడా వెంటనే తెలిసిపోతున్నాయి. పోలీసులు లేరని తిరిగితే ‘మూడో కన్ను’ వదిలిపెట్టదు.

360 డిగ్రీల్లో పనిచేసే నిఘా నేత్రం..
జంక్షన్లలో ఏర్పాటు చేసిన కెమెరాలు ఎప్పటికప్పుడూ ఆయా ప్రాంతాల్లో జరిగే దృశ్యాలను బంధిస్తుంటాయి. పాన్‌, పింట్‌, జూమ్‌.. అటూ ఇటూ చూడటం.. 360 డిగ్రీల కోణంలో తిరిగి అన్ని దృశ్యాలను రికార్డు చేస్తాయి. కెమెరా అమర్చిన ప్రాంతం నుంచి చుట్టుపక్కల 500 మీటర్ల మేర ఫొటోలను క్లిక్‌ మనిపిస్తాయి. ఇవన్నీ పోలీసు కంట్రోల్‌ రూంతో అనుసంధానమై ఉంటాయి. దీంతో పోలీసు అధికారులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించే వారి వాహనాల ఫొటోల ఆధారంగా వాహనదారుడి ఇంటికి ఈ–చలాన్‌ పంపిస్తున్నారు.

తగ్గిన రోడ్డు ప్రమాదాలు
హిందూపురానికి చెందిన సురేష్‌ పనిమీద బైక్‌పై ఆర్టీసీ బస్టాండుకు వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో బస్టాండు సమీపంలోని సెంటర్లో రెడ్‌ సిగ్నల్‌ పడింది. కానీ అక్కడ ట్రాఫిక్‌ సిబ్బంది ఎవరూ లేరన్న ధీమాతో సురేష్‌ ముందుకు వెళ్లిపోయాడు. సిగ్నల్‌ జంప్‌ చేసినందుకు ఈ–చలాన్‌ వేసి సాయంత్రానికి అతని సెల్‌కు పోలీసులు మెసేజ్‌ పంపారు.

అనంతపురానికి చెందిన రాము పనిమీద కారులో పుట్టపర్తికి వెళ్లాడు. అధికారులు నిర్ణయించిన దానికంటే వేగంగా కారు నడిపాడు. పైగా సీటు బెల్టుపెట్టుకోలేదు. తననెవరూ చూడలేదని తిరిగి ఇంటికి చేరాడు. రెండు రోజులకు ‘నో సీట్‌ బెల్ట్‌’... ‘ఓవర్‌ స్పీడ్‌’ కింద పోలీసులు జరిమానా వేసి ఇంటికి చలాన్‌ పంపారు.

..ఇలా మనం ఎక్కడ ఏ నిబంధన ఉల్లంఘించినా పోలీసు నిఘా నేత్రం పట్టేస్తోంది. నేరుగా ఈ–చలాన్‌ ఇంటికి వస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండగా ఈ–చలాన్లు పెరగ్గా...ప్రమాదాలు బాగా తగ్గాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement