వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి
పుట్టపర్తి టౌన్: చిన్నారి కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. వివరాలను ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. శనివారం రాత్రి పుట్టపర్తిలోని మోర్ సూపర్ బజార్ సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల వయసున్న బాలిక లక్షిత (5)ను చాక్లెట్లు, టపాసులు కొనిస్తానంటూ ఓ యువకుడు నమ్మించి అపహరించుకెళ్లాడు. పాప కనిపించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు గిరినాయక్, అరుణబాయి ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ వాసుదేవన్, సీఐ కొండారెడ్డి నేతృత్వంలో పోలీసులు బృందాలుగా సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా విడిపోయి స్థానిక యువకుల సాయంతో గాలింపు చేపట్టారు. పోలీసులు అప్రమత్తమైన విషయం తెలుసుకున్న యువకుడు చిన్నారిని ప్రశాంతి నిలయం సమీపంలో వదిలి ఉడాయించాడు. ఆదివారం తెల్లవారుజామున చిన్నారిని గుర్తించిన పోలీసులు సురక్షితంగా ఎస్పీ సమక్షంలో తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన విద్యార్థులు..
తప్పిపోయిన విద్యార్థులను ఆదివారం ఉదయం ఎస్పీ సమక్షంలో తల్లిదండ్రుల చెంతకు పోలీసులు చేర్చారు. వివరాలను ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. కదిరి, ఓడీచెరువు మండలం దిగువ గంగంపల్లి గ్రామానికి చెందిన కొందరు విద్యార్థులు ఓడీచెరువులోని ఓ ప్రైవేట్ పాఠశాల వసతి గృహంలో ఉంటూ అక్కడే పదో తరగతి చదువుకుంటున్నారు. ఈ నెల 6న కటింగ్ చేయించుకుని వస్తామంటూ వార్డెన్‌తో అనుమతి తీసుకుని బయటకు వచ్చిన ఇద్దరు విద్యార్థులు సాయంత్రమైనా హాస్టల్‌కు చేరుకోలేదు.
దీంతో అనుమానం వచ్చి పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ వెంటనే ఓడీచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వాసుదేవన్, సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బంది బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. విద్యార్థులు బెంగుళూరులోని శివాజీనగర్‌లో ఉన్నట్లు గుర్తించి, అక్కడకెళ్లి పిలుచుకొచ్చారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి సమక్షంలో విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment