
నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
పుట్టపర్తి టౌన్: విధి నిర్వహణలో అసువులుబాసి అమరులైన పోలీసులను గుర్తు చేసుకుంటూ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా జడ్జి రాఖేష్‌తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై విధి నిర్వహణలో అమరులైన పోలీస్ అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో 22 నుంచి 30 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహించనున్నారు. 31న సమైక్యతా దినంతో సంస్మరణ దినోత్సవాలు ముగుస్తాయి.
నేడు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావొచ్చని పేర్కొన్నారు.
నేటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
పుట్టపర్తి టౌన్: కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా)ల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1:5 ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. మెరిట్ లిస్ట్‌లో పేర్లు ఉన్న అభ్యర్థులకు వారి సెల్‌ఫోన్ ద్వారా సమాచారం పంపామని పేర్కొన్నారు. సదరు అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు ఒరిజనల్‌వి తీసుకొని బుక్కపట్నం సర్వశిక్ష అభియాన్ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు.
శతాధిక వృద్ధురాలు మృతి
ధర్మవరం అర్బన్: పట్టణంలోని గాండ్లవీధికి చెందిన శతాధిక వృద్ధురాలు సుంకర నాగమ్మ (106) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. బంధుమిత్రులతో పాటు వార్డులోని ప్రజలు తరలివచ్చి నాగమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. గత కొన్నాళ్ల క్రితం వరకు నాగమ్మ ఎంతో చలాకీగా ఉండేదని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు సుంకర నారాయణ, సుంకర పుల్లమ్మ, మనవళ్లు, మనవరాళ్లు సుంకర నరేష్, సతీష్, నారాయణస్వామి, రమాదేవి, నాగేశ్వరి తదితరులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం