
ఉచిత ఇసుక అందుబాటులో ఉంచాలి
ప్రశాంతి నిలయం: వినియోగదారులందరికీ ఉచిత ఇసుక అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ చేతన్ ఆదేశించారు. జిల్లాలో ఉచిత ఇసుక అమలుపై మంగళవారం స్థానిక మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నాణ్యమైన ఇసుక సరఫరా చేయాల్సిన బాధ్యత మైనింగ్ శాఖ అధికారులదేనన్నారు. నదీ ప్రవాహాలకు అనుకుని ఉన్న గ్రామాల పరిధిలో వినియోగదారులే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చన్నారు. ఆర్డీఓలు ఇసుక డంపింగ్ యార్డులను తనిఖీ చేయడంతో పాటు ప్రతి 15 రోజులకోసారి ఉచిత ఇసుక అమలుపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. అన్ని ఇసుక డంపింగ్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ బ్యానర్, జీపీఎస్ లేకుండా ఇసుకను రవాణా చేస్తే ఆ వాహనాన్ని బ్లాక్ లిస్ట్‌లో ఉంచాలన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వండి
జిల్లాల్లో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం చెప్పవచ్చని, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వి.రత్న తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌పై రోజువారీగా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. సమావేశంలో జేసీ అభిషేక్ కుమార్, జిల్లా గనులు శాఖ అధికారి పెద్దిరెడ్డి, ధర్మవరం ఆర్డీఓ మహేష్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
తప్పుడు సమాచారంతో ఆధార్ నమోదు చేయొద్దు
ఆధార్ నమోదు, అప్డేషన్‌న్లలో తప్పులు దొర్లకూడదని, ఎవరైనా తప్పుడు సమాచారంతో ఆధార్ నమోదు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆధార్ సెంటర్లను తనిఖీ చేసి నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ నమోదు స్పెషల్ క్యాంపులు నిర్వహించాలన్నారు.
స్వర్ణాంధ్రకు పది సూత్రాలు అమలు చేయాలి
స్వర్ణాంధ్ర విజన్–2047 సాకారానికి పది సూత్రాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. త్వరలో విజయవాడలో జిల్లా కలెక్టర్‌ల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలపై సమీక్షించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల ద్వారా ఆదాయాలు పెంచుకునే మార్గాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. నల్లచెరువు మండలంలో ఏర్పాటు చేయనున్న ఉద్యాన ప్రాసెసింగ్ యూనిట్‌పై సమీక్షించారు.
18పిటివై303–పది సూత్రాల అమలుపై సమీక్షిస్తున్న కలెక్టర్ టీఎస్ చేతన్
అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం