తాడిమర్రి: ప్రకృతి ప్రకోపం అన్నదాతలకు తీరని నష్టం మిగిల్చింది. శనివారం రాత్రి మండలంలో వడగండ్ల వర్షం, ఈదురుగాలులకు అరటి, దానిమ్మ, మొక్కజొన్న, టమాట పంటలు నేలకొరిగాయి. నాయనపల్లిలో రైతులు జానగాన పెద్దవీరనారప్ప, జడే శంకరయ్య, జడే నడిపి గంగన్న, జడే ఆది, బి.దస్తగిరి, పాళ్యం రహంతుల్లా, జడే శంకర్, డి.చెన్న యల్లప్ప, జె.శివయ్యతో సహా 15 మంది సాగు చేసిన అరటి తోటలు వడగండ్ల వర్షానికి దెబ్బతిన్నాయి. అరకొర పంటను కోసి అమ్ముకున్న మరో 20 మంది రైతులకూ తీరని నష్టం కలిగింది. దాడితోట గ్రామంలో ఈదురుగాలులకు రైతులు పాళ్యం రాము, పాళ్యం ఈశ్వరయ్య, సరిబాల రాజారెడ్డి, రవీంద్రారెడ్డి, పుల్లారెడ్డి, జొన్నగడ్డల శ్రీనివాస నాయుడు, బాలకృష్ణ తదితరులు సాగు చేసిన 130 ఎకరాల్లోని అరటి తోటలు ధ్వంసమయ్యాయి. తురకవారిపల్లిలో తమ్మినేని నరసింహనాయుడు, శ్రీరాములు, సూర్యనాగరాజు, పి.నారాయణ, నాగభూషణ, టి.నాగభూషణకు చెందిన దానిమ్మ చెట్లు నేలకొరిగాయి. ఇక టమాట తదితర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
వడగండ్ల వర్షం, ఈదురు గాలులకు నేలకొరిగిన పంటలు
ప్రకృతి ప్రకోపం.. రైతులకు తీరని నష్టం


