ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలి

Mar 25 2025 2:00 AM | Updated on Mar 25 2025 1:55 AM

అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌

అభిషేక్‌ కుమార్‌ ఆదేశం

ప్రశాంతి నిలయం: ‘‘తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లా కేంద్రం వరకూ వచ్చి అర్జీ ఇస్తున్నారు. ఇందుకోసం వారు పనులు మానుకోవడంతో పాటు చార్జీల కోసం డబ్బు వెచ్చిస్తున్నారు. దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలి’’ అని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 227 అర్జీలు అందగా, వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. అర్జీలకు పరిష్కారం చూపే క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఒకే ఫిర్యాదు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్జీల పరిష్కారం పురోగతిని కూడా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సూర్యనారాయణ రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పట్టు పరిశ్రమ శాఖ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్‌, ల్యాండ్‌ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఎల్‌డీఎం రమణకుమార్‌, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ తిప్పేంద్రనాయక్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజా బేగం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్‌, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

భార్యపై హత్యాయత్నం..

భర్తకు పదేళ్లజైలు

అనంతపురం/పుట్టపర్తి టౌన్‌: భార్యను వేధించడంతో పాటు హత్య చేసేందుకు యత్నించిన భర్తకు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం నాలుగో జిల్లా కోర్టు న్యాయమూర్తి శోభారాణి సంచలన తీర్పు వెలువరించారు. వివరాలు.. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి గ్రామానికి చెందిన కిష్టప్ప కుమారుడు చాకలి రాజశేఖర్‌కు, పుట్టపర్తి మండలం వెంకటగారి పల్లికి చెందిన చాకలి సావిత్రికి 2016లో వివాహమైంది. దంపతులిద్దరూ ముదిగుబ్బలో కాపురం పెట్టారు. ఆరు నెలల్లోనే భార్య సావిత్రిపై రాజశేఖర్‌ అనుమానం పెంచుకున్నాడు. తరచూ దూషించేవాడు. చంపుతానని బెదిరించేవాడు. వేధింపులు తట్టుకోలేక సావిత్రి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అక్కడికే వెళ్లిన రాజశేఖర్‌ ఆమెను కొట్టడమే కాకుండా తండ్రి ఓబులేసు ఫోన్‌ తీసుకెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే 2017 అక్టోబర్‌ 11న మధ్యాహ్నం 3 గంటల సమయంలో భార్యకు ఫోన్‌ చేసి.. తాను అరటికాయ లోడు తీసుకెళ్లడానికి వెళ్తున్నానని, వెంకటగారిపల్లి క్రాస్‌ వద్దకు వస్తే సెల్‌ఫోన్‌ ఇస్తానని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అక్కడికి సావిత్రి వెళ్లగా.. కంపచెట్లలో దాక్కుని ఉన్న రాజశేఖర్‌ ఉన్నపలంగా సావిత్రిపై దాడికి పాల్పడ్డాడు. ఎడుమ భుజం వెనుక, కుడిపక్క గొంతు కింద రెండు పోట్లు పొడిచాడు. అంతలోనే సావిత్రి అక్క కుమారుడు సాయి కృష్ణ, అతని స్నేహితుడు సాయి కుమార్‌, బావ రాము అక్కడికి రావడం చూసి పారిపోయాడు. గాయపడిన సావిత్రిని వెంటకగారి పల్లి సర్పంచ్‌ చిన్న రామప్ప 108 అంబులెన్స్‌లో పుట్టపర్తి సూపర్‌స్పెషాలిటీకి తరలించారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు విచారించిన అనంతపురం నాలుగో జిల్లా కోర్టు న్యాయమూర్తి శోభారాణి సోమవారం తీర్పు వెలువరించారు. ముద్దాయి చాకలి రాజశేఖర్‌కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున సుజన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ ధనుంజయ, పుట్టపర్తి రూరల్‌ ఎస్‌ఐ కేఎం లింగన్న, హెడ్‌ కానిస్టేబుల్‌ డి. శివ, మనోహర్‌, కోర్టులైజన్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు (ఏఎస్‌ఐ)ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

ప్రతి అర్జీకి నాణ్యమైన  పరిష్కారం చూపాలి 1
1/1

ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement