తేలికపాటి ఆహారం మంచిది | - | Sakshi
Sakshi News home page

తేలికపాటి ఆహారం మంచిది

Mar 25 2025 2:00 AM | Updated on Mar 25 2025 1:55 AM

ఏప్రిల్‌ 23 వరకూ ఒంటి పూట బడులు

మధ్యాహ్నం 12:30 గంటలకే ఇంటికి చేరుతున్న విద్యార్థులు

సరదాల మాటున పొంచి ఉన్న ప్రమాదాలు

కనిపెట్టకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు

రాయదుర్గం: ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించింది. ఏప్రిల్‌ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ నిబంధన పాటించేలా మార్గదర్శకాలు జారీచేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. త్వరగా నిద్ర లేచి ఉరుకులు పరుగులతో బడికి వెళ్లిన విద్యార్థులు మధ్యాహ్నం ఇళ్లకు చేరుకోగానే ఆటపాటలకు ప్రాధాన్యమివ్వడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ, నగర ప్రాంతాల్లోనూ వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ఈతకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆటలు, ఈత శారీరక వ్యాయామంగా మంచిదే అయినా... ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న సరదా మాటున ప్రమాదాలు పొంచి ఉంటాయనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణ తాపం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిల్లలకు అవగాహన కల్పించాలని చెబుతున్నారు.

4 లక్షలకు పైగా విద్యార్థులు

మండుటెండలోనే..

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 5,036 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 7,03,094 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 54,402 మంది మినహా మిగిలిన వారంతా ఒంటిపూట బడులకు హాజరవుతున్నారు. అలాగే 4,72,860 మందికి పైగా విద్యార్థులు ఇతర గ్రామాలకు, పట్టణాల్లో ఉండే ప్రైవేటు పాఠశాలలకు వాహనాలు, కాలినడకన వెళ్లి వస్తుంటారు. వీరంతా మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత పాఠశాల నుంచి మండుటెండలో ప్రయాణం చేయాల్సి ఉంటోంది. ఇలాంటి తరుణంలో పిల్లలు సరైన జాగ్రత్తలు తీసుకునేలా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులూ చొరవ చూపాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీ ధరించడం లేదా, తల.. ముఖ భాగం పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రం కట్టుకుంటే మరీ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

తీవ్ర సూర్యరశ్మితో ప్రమాదం..

ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడి కిరణాలు నిటారుగా భూమిపై పడుతుంటాయి. ఈ సమయంలో ఎక్కువగా బయట తిరిగితే అతినీలలోహిత కిరణాలు నేరుగా శరీరాన్ని తాకడం వల్ల చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. మరోవైపు అంతర్గతంగా కూడా ఈ కిరణాల ప్రభావం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బడి ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న పిల్లలను తప్పనిసరి అయితే తప్పా బయటకు పంపకూడదని సూచిస్తున్నారు. ప్రయాణాల సమయంలో ద్విచక్ర వాహనంపై పిల్లలను ముందు భాగంలో కూర్చోబెట్టుకుంటే వడగాలుల తీవ్రతకు వడదెబ్బ సోకే ప్రమాదం ఉందంటున్నారు.

బోర్‌ అనిపించకుండా..

ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉంటే చాలా బోర్‌గా ఫీలవుతారు. దీంతో సెల్‌ఫోన్లకు అలవాటు పడితే మరింత ప్రమాదం. పిల్లలు బోర్‌ ఫీల్‌ కాకుండా ఉండేందుకు నీడ పట్టున వారికి కొత్త ఆటలు గాని, విజ్ఞానాన్ని పంచే అంశాలపై ఆసక్తి పెంపొందించాలి. వీలైనంత మేర తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. పాఠశాలల్లో ఇచ్చిన హోమ్‌వర్క్‌ మధ్యాహ్నం చేసుకునేలా ప్రోత్సహించాలి. తద్వారా సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత ఆడుకునే వెసులుబాటు కలుగుతుంది. వేసవి తాపం కారణంగా పిల్లలు తొందరగా అలసిపోతారు కావున, మధ్యాహ్నం కొంత సమయం విశ్రాంతి తీసుకునేలా చూడాలి.

మృతుడు అయాన్‌

(ఫైల్‌)

మృతుడు రిహాన్‌

(ఫైల్‌

వేసవిలో పిల్లలకు తేలికపాటి ఆహారం చాలా మంచిది. త్వరగా జీర్ణమయ్యే ఉప్మా, ఇడ్లీ వంటివి అల్పాహారంగా ఇవ్వాలి. పండ్ల రసాలు తాగించి బడికి పంపాలి. నీరు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. మరీ చల్లని పదార్థాలు ఇవ్వొద్దు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత తేలికగా ఉండే ఆహారం ఇవ్వాలి. వేపుళ్లు, మాంసాహారం వంటి వాటికి వేసవి పూర్తయ్యే వరకూ స్వస్తి చెప్పడం మేలు. రాత్రి పూట త్వరగా నిద్రించేలా అలవాటు చేయాలి. నిద్రలేచిన తర్వాత కొంత సమయం చదువుకునేలా అలవాటు చేస్తే మేధాశక్తి పెరుగుతుంది.

– డాక్టర్‌ మెర్సీ జ్ఞానసుధ,

మెడికల్‌ సూపరింటెండెంట్‌,

ఏరియా ఆస్పత్రి, రాయదుర్గం

హిందూపురంలోని ఆటోనగర్‌లో నివాసముంటున్న జహీర్‌ కుమారుడు రిహాన్‌ (14), సుహేల్‌, ఉమేరా దంపతుల కుమారుడు అయాన్‌ (12) స్థానిక పాఠశాలలో 7, 6 తరగతులు చదువుకుంటున్నారు. ఈ నెల 9న ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో తోటి స్నేహితులతో కలసి సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలోని నీటి కుంటకు వెళ్లారు. లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీట మునిగిపోయారు. తోటి స్నేహితుల కేకలతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని నీట మునిగిన ఇద్దరినీ వెలికి తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. చికిత్సకు స్పందించక రిహాన్‌, అయాన్‌ మృతి చెందారు.

... ఇలాంటి దుర్ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోకొల్లలుగా జరుగుతున్నాయి. సెలవుల్లో పిల్లలను ఓ కంట కనిపెట్టకపోతే ఎంత అనర్థాలకు దారి తీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

తేలికపాటి ఆహారం మంచిది1
1/3

తేలికపాటి ఆహారం మంచిది

తేలికపాటి ఆహారం మంచిది2
2/3

తేలికపాటి ఆహారం మంచిది

తేలికపాటి ఆహారం మంచిది3
3/3

తేలికపాటి ఆహారం మంచిది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement