బత్తలపల్లి: సర్టిఫికెట్లు జిరాక్స్ చేయించుకుని వస్తానంటూ వెళ్లిన విద్యార్థిని కనిపించకుండా పోయింది. పోలీసులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి అనంతపురంలోని పీవీకేకేలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కళాశాలకు సెలవుల నేపథ్యంలో వారం రోజులుగా ఇంటి పట్టునే ఉన్న ఆమె శనివారం తన ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించుకుని, సర్టిఫికెట్లు జిరాక్స్ చేయించుకుని వస్తానంటూ కుటుంబసభ్యులకు తెలిపి వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి రాలేదు. గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వివాహిత బలవన్మరణం
గాండ్లపెంట: జీవితంపై విరక్తితో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గాండ్లపెంట మండలం వంకపల్లికి చెందిన వద్దిరెడ్డి రాజేశ్వరి (30) వేపరాల గ్రామ సచివాలయంలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్‌గా, భర్త ఈశ్వరరెడ్డి ఎఫ్‌ఈఎస్ స్వచ్ఛంద సంస్ధలో పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం వ్యక్తిగత పనిపై ఈశ్వరరెడ్డి అనంతపురానికి వెళ్లాడు. చిన్న కుమారుడు అభిలాష్ పాఠశాలకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజేశ్వరి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి చేరుకున్న అభిలాష్ ఇంట్లో ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతున్న తల్లిని గమనించి పక్కింటి వారికి తెలపడంతో వారి సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అల్లుడు ఈశ్వరరెడ్డి వేధింపులు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వలీబాషా కేసు నమోదు చేశారు.
లారీల ఢీ – డ్రైవర్ దుర్మరణం
కనగానపల్లి: మండలంలోని 44వ జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ కొన్నాయి. ఘటనలో నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పెదరాజుపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ ప్రసాద్ (45) దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు... సోమవారం తెల్లవారుజామున అనంతపురం వైపు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న లారీ పర్వతదేవరపల్లి వద్దకు చేరుకోగానే డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని తగ్గించాడు. దీంతో వెనుకనే వస్తున్న లారీ డ్రైవర్ వేగాన్ని నియంత్రించుకునే సమయం కూడా లేకపోవడంతో నేరుగా వెళ్లి ముందున్న లారీని ఢీకొన్నాడు. ఘటనలో వెనుక ఉన్న లారీ క్యాబిన్‌లోనే డ్రైవర్ ప్రసాద్ చిక్కుకున్నాడు. స్థానికులు గమనించి అతి కష్టంపై ఆయనను వెలికి తీశారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఆయన మృతి చెందాడు. ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రాజ్యాంగ పరిరక్షణకు పోరుబాట
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
హిందూపురం టౌన్: ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణకు పోరుబాట పడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ‘రాజ్యాంగ పరిరక్షణ’ అంశంపై సోమవారం హిందూపురంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ స్ఫూర్తితో సీపీఐ పోరాటాలను ఉధృతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని పరిరక్షణకు లౌకికవాదులంతా ఏకం కావాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య మాట్లాడుతూ... హంద్రీనీవా ద్వారా తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్, సీపీఐ పట్టణ కార్యదర్శి వినోద్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆటో నుంచి కిందపడి బాలిక మృతి
చిలమత్తూరు: హిందూపురం పరిధిలోని కొట్నూరు సమీపంలో వేగంగా వెళుతున్న ఆటో నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి కొట్నూరుకు చెందిన వైష్ణవి(13) మృతి చెందింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో కిందపడడంతో తీవ్ర గాయాలైన వైష్ణవిని స్థానికులు వెంటనే హిందూపురంలోని జిల్లాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స మొదలు పెట్టే లోపు ఆమె మృతి చెందింది. ఘటనపై ఎస్‌ఐ శ్రీధర్ దర్యాప్తు చేపట్టారు.
విద్యార్థిని అదృశ్యం
విద్యార్థిని అదృశ్యం
విద్యార్థిని అదృశ్యం


