హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధర పెరిగింది. మంగళవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 159 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో క్వింటా గరిష్టంగా రూ.15,400, కనిష్టంగా రూ.7,500, సరాసరిన రూ.13,500 ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. గత వారంతో పోలిస్తే క్వింటాపై రూ.500 మేర పెరిగిందని ఆయన వెల్లడించారు.
బెంగళూరు–కలబురిగి మధ్య ప్రత్యేక రైలు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 28, 29వ తేదీల్లో బెంగళూరు–కలబురిగి మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 28న బెంగళూరు జంక్షన్ నుంచి రాత్రి 9.15 గంటలకు బయలుదేరనున్న రైలు మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు కలబురిగి జంక్షన్‌కు చేరుతుందన్నారు. తిరిగి 29వ తేదీ ఉదయం 9.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 8 గంటలకు బెంగళూరు జంక్షన్ చేరుకుంటుందన్నారు. యలహంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, కృష్ణా, యాద్గిరి, షాహాబాద్ రైల్వేస్టేషన్ల మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
● చిన్న పొరపాటు కూడా జరగకూడదు
● జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మండలాల్లో ఈ నెల 27న జరగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఆర్.రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య ఆదేశించారు. మంగళవారం అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలోని సీఈఓ చాంబర్‌లో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రొద్దం, గాండ్లపెంట, రామగిరి, కణేకల్లు, కంబదూరు మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు, ఉరవకొండ, పెద్దపప్పూరు, యల్లనూరు, రాయదుర్గం మండలాల్లో వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా మండలాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే ఎన్నుకునే హక్కు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మండల కో–ఆప్షన్ సభ్యులకు ఓటింగ్ ఉండదన్నారు. మెజారిటీ సభ్యులు చేతులెత్తి మద్దతు తెలిపిన వారే ఎంపీపీ, వైస్ ఎంపీపీగా ఎన్నికవుతారన్నారు. ఎన్నికల రోజున బందోబస్తు కూడా ఉంటుందన్నారు.
పెరిగిన ఎండుమిర్చి ధర


