పరిగి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి అడ్డదారిలో ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సవితకు లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. మంగళవారం పరిగి మండలం తిరుమలదేవరపల్లిలో పర్యటించిన ఆమె స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత సోమవారం కాంగ్రెస్ పార్టీ వైపు వైఎస్ జగన్ చూస్తున్నారంటూ మంత్రి సవిత మాట్లాడిన తీరును ఆక్షేపించారు. సవిత ఎన్నటికీ రాజకీయాలకు పనికిరారన్నారు. అవగాహన లేకుండా మాట్లాడితే ఉన్న పరువు కాస్త పోతుందని గ్రహించాలని హితవు పలికారు. వైఎస్ జగన్ ఎప్పటికీ సింగిల్‌గానే వస్తారని, ఆయనకు ఎవరి మద్దతూ అవసరం లేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో అంటకాగి వైఎస్ జగన్‌ను అణగదొక్కాలని చూసిన చంద్రబాబు కుట్రలు రాష్ట్ర ప్రజలకు తెలియనివి కావన్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా జగనన్నను ఎదుర్కొలేరన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సవిత... బీసీలకు చేసిన మేలు ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పాలని, ఆమెలో ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా... బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని సవాల్ విసిరారు. పరిగి మండలం కొడిగెనహళ్లి ప్రీకాట్ స్పిన్నింగ్ మిల్లు మూసివేతతో రోడ్డున పడిన కార్మిక కుటుంబాలకు చేనేత జౌళీ శాఖ మంత్రిగా ఆమె చేసిన న్యాయమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాలుగా పరిగి, పెనుకొండ, మడకశిర, హిందూపురం ప్రాంతాలతో పాటూ బిహార్, ఒడిశా రాష్ట్రాల వలస కార్మికులకు జీవనోపాధిని అందించిన ఫ్యాక్టరీ నేడు మూత పడడానికి కూటమి ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. తన ఇలాఖాలో ఓ మిల్లు మూతపడిదంటే జౌళీ శాఖ మంత్రిగా ఆమె సిగ్గుపడాలన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచుతామంటూ ఉన్న పరిశ్రమలను మూత పడేలా చేయడం చంద్రబాబు సర్కార్‌కే సాధ్యమన్నారు. కురుబ కులంలో పుట్టిన సవిత... గుడికట్ల పూజారులకు నెలకు రూ.5వేలు గౌరవవేతనం చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం మాని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.
మంత్రి సవితపై వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజం


