● గాండ్లపెంటలో
అడుగడుగునా పచ్చ ఆటంకం
గాండ్లపెంట: బలంలేకపోయిన ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ కుటిల యత్నాలకు తెరలేపింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 7 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిలో సోమయాజులపల్లి స్థానంలో మాత్రమే టీడీపీ గెలుపొందింది. మిగిలిన 6 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. అయితే వేపరాల ఎంపీటీసీ టీడీపీకి మద్దతు ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ వైపు ఐదుగురు ఎంపీటీసీలు ఉన్నారు. సభలో టీడీపీకి ఇద్దరు సభ్యులు ఉండగా సంఖ్యా బలం లేకపోవడంతో పాటు బలపరిచే వారు కూడా లేరు. ఎంపీపీ ఎన్నికలో పాల్గొనాల్సిన ఎంపీటీసీలు 11 గంటలకు కార్యాలయానికి చేరుకోవాల్సి ఉన్నా టీడీపీ ఇద్దరు ఎంపీటీసీలు చేరుకోగా .. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు కదిరి నుంచి గాండ్లపెంటకు వస్తుండగా మార్గమధ్యలో కదిరి–రాయచోటి ప్రధాన రహదారిలో ఫ్రెండ్స్ పంక్షన్ హాల్ వద్ద పోలీసులు సోదాల పేరుతో గంటల కొద్దీ అడ్డుకున్నారు. దీంతో ఆలస్యం జరిగింది. అక్కడి నుంచి కదిరి టౌన్ సీఐ ఎంపీటీసీలను తన వాహనంలో తీసుకువచ్చారు. ప్రధాన రహదారిలో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే సమయంలో వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకుడు సీఎస్ అబ్దుల్‌రవూఫ్ ఎంపీటీసీలను పిలుచుకు వస్తుండగా పోలీసులు రవూఫ్‌ను లోపలికి పోకుండా అడ్డుకున్నారు. పార్టీ విప్ అధికారికంగా ఇచ్చిందని, పీఓతో మాట్లాడిన అనంతరం లోపలికి పంపారు. అయితే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు ఆలస్యంగా వచ్చారంటూ ఎన్నికల అధికారి ఎన్నికను శుక్రవారం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభను వాయిదా వేయకూడదని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు సమావేశ భవనంలోనే బైఠాయించారు. ఎంపీటీసీలను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులకు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు అందరిని అక్కడి నుంచి పంపివేశారు.


