ఉట్టిపడిన తెలుగు సంస్కృతి
ప్రశాంతి నిలయం: శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ప్రశాంతి నిలయంలో ఘనంగా జరిగాయి. వేలాదిమంది భక్తులు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ఆశీనులుగా కాగా.. వేడుకలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించాయి. వేదపండితులు డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి పంచాంగ పఠనం చేశారు. శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో సత్యసాయి, దేవదేవుని ఆశీస్సులు విశ్వమానవాళిపై ఉంటాయని, వర్షాలు సకాలంలో కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండి సకల మానవులు సుభిక్షంగా ఉంటారని వివరించారు. అనంతరం భక్తులు సంగీత కచేరి నిర్వహించారు. ఇటీవల మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో నిర్వహించిన అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహించారు. సాయికుల్వంత్ సభా మందిరంలో జరిగిన యజ్ఞంలో పాల్గొనలేని భక్తుల కోసం సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో శ్రీరుద్రం పఠించి యజ్ఞంలో భాగస్వాములయ్యే అవకాశం కల్పించింది. 113 దేశాలకు చెందిన 15 వేల మందికి పైగా భక్తులు శ్రీరుద్రం పఠించారు. ఇంతమంది అన్‌లైన్ ద్వారా విన్నందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇప్పటికే నమోదైంది. తాజాగా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా రికార్డు సాధించడంలో ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్, సిగ్మా హెల్త్ కేర్ సీఈఓ డాక్టర్ ప్రదీప్ భరద్వాజ్ రికార్డుకు సంబంధించి సర్టిఫికెట్‌ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుల సమక్షంలో సత్యసాయి మీడియా సెంటర్ ప్రతినిధులకు అందజేశారు. అలాగే సత్యసాయి మీడియా సెంటర్ ‘శ్రీ సత్యసాయి సాహిత్య’ పేరుతో రూపొందించిన వెబ్‌పోర్టల్‌ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్ రాజు ట్రస్ట్ సభ్యులతో కలసి ప్రారంభించారు. సాయంత్రం ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసురాలు గుడిపాటి శ్రీలలితా బృందం సంగీత కచేరీ నిర్వహించారు.
ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు
ఉగాదికి ఘన స్వాగతం
విశ్వ శ్రేయస్సును కోరే శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతించారు. పండుగ సందర్భంగా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పండితుల పంచాంగ పఠనాన్ని శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ రకాల ఆటలు, పందేలు, శక్తి ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
– పుట్టపర్తి
ఉట్టిపడిన తెలుగు సంస్కృతి


