ప్రశ్నిస్తే చంపేస్తారా?
● పరిటాల సునీత, శ్రీరామ్
డైరెక్షన్‌లోనే లింగమయ్య హత్య
● అధికారంలోకి వస్తే
వడ్డీతో సహా చెల్లిస్తాం
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్
● అంత్యక్రియలకు వెళ్తున్న
మాధవ్‌ను అడ్డుకున్న పోలీసులు
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వంలో ప్రశ్నిస్తే చంపేస్తారా అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. కురుబ లింగమయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సోమవారం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి బయలుదేరిన ఆయనను అనంతపురంలోని ఇంటివద్ద పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్టు చేసి నోటీసు అందజేశారు. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విలేకరులతో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ గత ఐదేళ్లూ రాప్తాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గొడవలు, హత్యా రాజకీయాలను ప్రోత్సహించకుండా పాలన సాగిస్తే పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత హత్యా రాజకీయాలకు తెర లేపారని విమర్శించారు. ఒక బీసీ నాయకుడిని అత్యంత దారుణంగా కొట్టి హతమార్చారన్నారు. వీటన్నింటికీ తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ‘మళ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడేదీ లేదు, చంద్రబాబు గెలిచేదే లేదు’ అని స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు..
ఐదేళ్ల వైఎస్ జగన్ పరిపాలన రామరాజ్యం గుర్తుకు తెచ్చిందని మాధవ్ పేర్కొన్నారు. అలాంటి రామరాజ్యాన్ని చంద్రబాబు సీఎం అయిన తర్వాత రావణకాష్టంగా మార్చారన్నారు. హత్యలు, దాడులు, మానభంగాలు, దోపిడీలు, దౌర్జన్యాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. తప్పుడు కేసులు బనాయిస్తూ అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులపై, ప్రశ్నించేవారిపై, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జ న్యాలు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ ప్రజాస్వామ్యవాదుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారన్నారు.
పరిటాల సునీత, శ్రీరామ్ డైరెక్షన్‌లో హత్యలు
రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ డైరెక్షన్‌లో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని మాధవ్ అన్నారు. ఇటీవల ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో బాలన్న అనే వ్యక్తిని పరిటాల సునీత సమీప బంధువులు హత్య చేసేందుకు యత్నించారని, ఆ ఘటన మరువకముందే పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను సునీత దగ్గర బంధువులు హత్య చేశారన్నారు. లింగమయ్య కుమారులను కూడా హత్య చేయాలని చూస్తే వారు తప్పించుకున్నారన్నారు. ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని, చర్యకు ప్రతి చర్య ఉంటుందని స్పష్టం చేశారు.


