ముగిసిన పదో తరగతి పరీక్షలు
పుట్టపర్తి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 104 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.
ముగ్గురిపై వేటు
మార్చి 17న పరీక్షలు ప్రారంభం కాగా, చివరి రోజు నాటికి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఇన్విజిలేటర్లపై సస్పెన్షన్ వేటు పడింది. మాస్‌కాపీయింగ్ చేస్తూ దొరికిపోయిన ఓ విద్యార్థి డీబార్ అయ్యారు. గణితం పరీక్ష రోజున పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రత్యేకాధికారి సుబ్బారావు కదిరి నియోజకవర్గంలో పర్యటించి... విధుల్లో నిర్లక్ష్యం వహించిన కదిరి బాలికల ఉన్నత పాఠశాల ఇన్విజిలేటర్లు రుద్రమరెడ్డి, డి.కృష్ణప్పను సస్పెండ్ చేశారు. అలాగే ముదిగుబ్బ బాలికల ఉన్నత పాఠశాలలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి మాస్ కాపీయింగ్ చేస్తూ స్క్వాడ్‌కు దొరికిపోయాడు. దీంతో విద్యార్థిని డీబార్ చేశారు. విద్యార్థి మాస్‌కాపీయింగ్ చేస్తున్నా.. చర్యలు తీసుకోని ఇన్విజిలేటర్ మహమ్మద్ రఫీని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఆ పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
చివరి రోజు 240 మంది గైర్హాజరు
చివరి రోజు మంగళవారం నిర్వహించిన సోషల్ పరీక్షకు 240 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాఽధికారి కృష్ణప్ప తెలిపారు. 21,448 మందికి గాను 21,248 మంది మాత్రమే హాజరయ్యారని ఆయన వివరించారు.
చివరిరోజు సోషల్ పరీక్షకు
240 మంది గైర్హాజరు
ముగ్గురు ఇన్విజిలేటర్ల సస్పెన్షన్, ఓ విద్యార్థి డీబార్


