ఎండలకు రాలేం సారూ
పుట్టపర్తి: భానుడి భగభగలతో జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కుకు చేరుకుంటున్నాయి. ఉదయం 10 తర్వాత కాలు బయటపెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్ బోర్డు విద్యార్థులను ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకుంది. ఏటా జూన్‌లో ప్రారంభించే సెకండ్ ఇంటర్ తరగతులను ఈసారి ఏప్రిల్ 1వ తేదీనే ప్రారంభించింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తొలిరోజు ఒక్కరూ రాలేదు
సెకండ్ ఇంటర్ తరగతులను ప్రభుత్వం మంగళవారం అట్టహాసంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా జిల్లాలో ఒక్కరంటే ఒక్కరూ తరగతులకు హాజరు కాలేదు. జిల్లాలో 70 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 42 ప్రైవేట్ కళాశాలలు ఉండగా... 13,083 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నారు. అయితే తీవ్రమైన ఎండలు, మంగళవారం సెంటిమెంట్ నేపథ్యంలో తొలిరోజు చాలా కళాశాలలు కూడా తెరుచుకోలేదు.
కళాశాలల్లో సౌకర్యాలు ఎక్కడ?
వేసవిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ ఇంటర్ తరగతులు ప్రారంభించిన ప్రభుత్వం కళాశాలల్లో కనీస సౌకర్యాలపై మాత్రం దృష్టి సారించలేదు. చాలా కళాశాలల్లో ఇప్పటికే ఫర్నీచర్ కొరత వేధిస్తోంది. ఇక తాగునీరు, ఫ్యాన్ లాంటి సౌకర్యాలు ఎన్ని కళాశాలల్లో ఉన్నాయో ఇంటర్ బోర్డు అధికారులకే తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా హడావుడిగా తరగతులు ప్రారంభించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఏ రాష్ట్రంలోనైనా కళాశాలలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయా.. అని ప్రశ్నిస్తున్నారు.
సెకండ్ ఇంటర్ తరగతులు ప్రారంభం
తొలిరోజు ఒక్కరూ హాజరుకాని వైనం
చాలా ప్రాంతాల్లో
తెరచుకోని కళాశాలలు
సర్కారు నిర్ణయంపై భగ్గుమంటున్న తల్లిదండ్రులు
జూన్ నుంచి ప్రారంభించాలి
మేం మొదటి సంవత్సరం పరీక్షలు రాసి 15 రోజులు కూడా కాలేదు. అప్పుడే సెకండ్ ఇంటర్ తరగతుల ప్రారంభించడం సరికాదు. ఎండలు మండుతున్న తరుణంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు చాలా దారుణం. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలి.
– పవన్, సెకండ్ ఇంటర్ విద్యార్థి, బుక్కపట్నం
కార్పొరేట్ కళాశాలల లబ్ధికే
వేసవిలోనే తరగతులు ప్రారంభించడం వల్ల నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు ఇబ్బందులు ఉండవు. అందుకోసమే ప్రభుత్వం ఇంటర్ తరగతుల నిర్వహణ చేపట్టింది. ఇందుకోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది.
– అమర్నాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ ఎస్‌యూ
ఎండలకు రాలేం సారూ
ఎండలకు రాలేం సారూ


