చౌడేశ్వరీ.. నమోస్తుతే
హిందూపురం: మండలంలోని కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వరీ దేవి రథోత్సవం మంగళవారం కమనీయంగా సాగింది. ఏటా ఉగాది పండుగ అనంతరం అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం అనవాయితీ సాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన అమ్మవారి రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిమంది తరలివచ్చారు. దీంతో కొటిపి గ్రామం కిక్కిరిసింది.
సారె సమర్పించి...మొక్కులు తీర్చుకుని
ఉత్సవాల సందర్భంగా మంగళవారం తెల్లవారుజామునే మూలవిరాట్ చౌడేశ్వరీదేవి అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలతో పాటు పుష్పాలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికు ఒడిబియ్యం, సారె సమర్పించారు. మొక్కులో భాగంగా పలువురు భక్తులు ఆలయం వద్ద కోళ్లు, మేకలను అమ్మవారికి బలి ఇచ్చారు .
జాతర సందర్భంగా గ్రామ ప్రజలు బంధువులు, సన్నిహితులను పిలిచి విందు భోజనం పెట్టారు.
వైభవంగా రథోత్సవం
సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి విశేష పూజలు చేసి అత్యంత శోభాయమానంగా ముస్తాబుచేశారు. అనంతరం అర్చకులు మేళతాళాలతో రథంపై కొలువుదీర్చి కొటిపి గ్రామ వీధులు గుండా ఊరేగించారు. అనంతరం రథాన్ని ఆలయం వద్దకు చేర్చారు. ఉత్సవాన్ని తిలకించేందుకు హిందూపురం చుట్టుపక్కల గ్రామాలే కాకుండా కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
చౌడేశ్వరీ.. నమోస్తుతే


