పుట్టపర్తి అర్బన్: వేసవి తీవ్రమవుతున్న తరుణంలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు జిల్లాలోని వివిధ గ్రామాల్లో నీటి తొట్టెల నిర్మాణాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. మంగళవారం ఆయన.. పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో పశువుల నీటి తొట్టెకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాకు 1,362 నీటి తొట్టెలు మంజూరయ్యాయన్నారు. డ్వామా ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. వేసవిలో పశువులు నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్రామంలో అందరి సహకారంతో అనువైన చోట నీటి తొట్టెను నిర్మించాలన్నారు. ఒక్కో నీటి తొట్టెకు ప్రభుత్వం ‘ఉపాధి హామీ’ ద్వారా రూ.33 వేలు మంజూరు చేస్తుందన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్, పశు సంవర్ధక శాఖ అధికారి శుభదాస్, డీపీఓ సమత, పలువురు అధికారులు పాల్గొన్నారు.
హంద్రీ–నీవా కాలువకు గండి
సోమందేపల్లి: హంద్రీ–నీవా కాలువకు గండి పడింది. మంగళవారం తెల్లవారుజామున మండల పరిధిలోని కాలువ కట్ట తెగిపోయింది. దీంతో నీరంతా వృథాగా పొలాల్లో పారింది. నీటి ఉధృతి ఎక్కువ కావడంతోనే కట్ట తెగినట్లు రైతులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న హంద్రీ–నీవా అధికారులు అక్కడికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు.
‘డైట్’ అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
పుట్టపర్తి టౌన్: బుక్కపట్నంలోని విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ఖాళీగా ఉన్న 17 అధ్యాపకుల పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డిప్యూటేషన్ పద్దతిలో పని చేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జెడ్పీ స్కూల్ అసిస్టెంట్‌లు, హెచ్‌ఎంలు, ఎంఈఓలు అర్హులు.
జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తూ ఐదేళ్ల పైబడిన సర్వీసు కలిగిన 58 సంవత్సరాల్లోపు వయసున్న వారు, ఈ నెల 10 తేదీ లోపు అనంతపురంలోని డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 16, 17 తేదీల్లో రాత పరీక్ష, 19న మౌఖిక పరీక్షలు నిర్వహించి జిల్లా కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు డైట్ కళాశాల ప్రినిపాల్‌ను సంప్రదించవచ్చు.
జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ధర్మవరం వాసి
ధర్మవరం అర్బన్: జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టులో ధర్మవరానికి చెందిన కార్తీక్‌నాయక్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మంగళవారం కార్తీక్ నాయక్‌ను ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని బాస్కెట్‌బాల్ కోర్టులో ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అసోసియేట్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి అభినందించారు. జాతీయ స్థాయిలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు చిత్తూరులో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారని, ఈ శిక్షణలో రాణించి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ధర్మాంబ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ్‌తుల్లా, కోచ్ సంజయ్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీడీ నాగేంద్ర పాల్గొన్నారు.
జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ధర్మవరం వాసి
పశువుల నీటి తొట్టెల నిర్మాణం పూర్తి చేయాలి


