బీసీలపై దాడులు సహించం
పుట్టపర్తి టౌన్: ఆధిపత్య పోరులో బీసీలను సమిధలు మార్చే కూటమి నేతల చర్యలను ఖండిస్తున్నామని, బీసీలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని రాయలసీమ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు కొట్టాల శ్రీరాములు హెచ్చరించారు. పుట్టపర్తిలోని సాయి ఆరామంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలపై అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ వ్యాప్తంగా ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కూటమి నేతల స్వార్థానికి ఇటీవల కర్నూలు జిల్లాలో ఇద్దరు బీసీలు, పుంగనూరులో ఒకరు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలు మరువకనే రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యపై ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులు రాళ్లు, రాడ్లతో దాడి హతమార్చారడం దారుణమన్నారు. కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడన్న ఒకేఒక్క కారణంతో అత్యంత పాశావికంగా ఆయనను హతమార్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని ఎదిరించే సత్తా, దమ్ము, ధైర్యం లేక అమాయకులైన కురుబలపై ప్రతాపం చూపడం ఎమ్మెల్యే సునీతకు తగదన్నారు. తన సొంత జిల్లాలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ నోరు కూడా మెదపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. బీసీ ఓట్లతో అధికారం చేపట్టిన విషయాన్ని కూటమి పెద్దలు విస్మరించి విష సంస్కృతికి బీజమేస్తున్నారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. లింగమయ్య కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు ఎల్‌ఐసీ వెంకటరాముడు, ఓడీపీ ఆదినారాయణ, డాక్టర్ తిరుపతేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు కొట్టాల శ్రీరాములు


