పీఏబీఆర్‌లో నీట మునిగి యువకుడి మృతి
ఉరవకొండ: మండలంలోని రాకెట్ల గ్రామానికి చెందిన కత్రిమల కార్తీక్ (25) ప్రమాదవశాత్తు పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నీట మునిగి మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు... కార్తీక్‌కు ఆరు నెలల క్రితం బళ్లారి జిల్లా కుడితిని గ్రామానికి చెందిన అఖిల అలియాస్ లక్ష్మి వివాహమైంది. ఈ క్రమంలో బళ్లారికి మకాం మార్చి కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఉగాది పండుగ సందర్భంగా ఇటీవల స్వగ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. పీఏబీఆర్ సమీపంలో ఉన్న బంధువుల పంట పొలాలకు నీరు పెట్టేందుకు జలాశయంలో మోటారు దింపాల్సి ఉండడంతో వారితో కలసి గురువారం రాత్రి 9 గంటలకు జలాశయం వద్దకు వెళ్లాడు. మోటారును నీటిలో దించే క్రమంలో జలాశయం లోపలికి వెళ్లిన కార్తీక్.. కాలు చేపల వలకు చిక్కుకుంది. వల నుంచి కాలును విడిపించుకునే క్రమంలో ఊపిరి ఆడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకుని కార్తీక్ మృతదేహాన్ని వెలికి తీయించి, పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, పైళ్లెన ఆరు నెలలకే భర్తను కోల్పోయిన అఖిలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.


