పాముకాటుతో రైతు మృతి
రొద్దం: పొలం పనులు చేస్తున్న రైతు పాముకాటుకు గురై మృతి చెందాడు. కంబాలపల్లికి చెందిన రైతు కురుబ సిద్దప్ప(48), సువర్ణమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. శనివారం ఉదయం సిద్దప్ప మల్బరి తోటలో గుంటక పాస్తుండగా పాము కాటువేసింది. ఏదో పుల్ల గుచ్చుకుందని భావించి అలాగే పనిలో నిమగ్నమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత అపస్మారక స్థితిలో ఉడిపోయాడు. అటు వైపు వెళ్లిన కొందరు గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. వారు హుటాహుటిన పెనుకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గం మధ్యలోనే సిద్దప్ప మృతి చెందినట్లు వైద్యులు వివరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
లేపాక్షి: చోళసముద్రం టోల్ గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. శనివారం పరిగి మండలం శ్రీరంగరాజుపల్లికి చెందిన భాగ్యరాజ్ (23) పని నిమిత్తం చిలమత్తూరుకు వెళ్లాడు. పని ముగించుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా చోళసముద్రం టోల్‌గేట్ సమీపంలో లేపాక్షి మండలం గలిబిపల్లికి చెందిన నాగరాజు ద్విచక్రవాహనంపై వస్తూ ఎదురుగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో భాగ్యరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నాగరాజును 1033 వాహనంలో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మానసికరోగి బలవన్మరణం
పావగడ: కణివేనహళ్ళికి చెందిన మానసిక రోగి హనుమంతరాయప్ప(40) చాకుతో గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. సంజీవమ్మ, నారాయణప్ప దంపతుల కుమారుడు హనుమనంతంతరాయప్ప. ఈయనకు భార్య ఈరమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఐదారు నెలలుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ఇంట్లోనే ఉంచి కాపలా ఉండేవారు. అయినా కళ్లుగప్పి పలుమార్లు ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. శుక్రవారం కుటుంబ సభ్యులు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండగా హనుమంతరాయప్ప తప్పించుకుని ఊరి బయట ఉన్న మొక్కజొన్నతోటలోకి వెళ్లాడు. అక్కడ చాకుతో గొంతు కోసుకుంటుండగా గ్రామస్తులు గమనించి వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తుమకూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సీఐ సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పాముకాటుతో రైతు మృతి
పాముకాటుతో రైతు మృతి


