నేడు వేమన ఆలయంలో మహాశక్తి పూజ
గాండ్లపెంట: విశ్వకవి యోగి వేమన వార్షిక ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని కటారుపల్లిలోని ఆలయంలో ఆదివారం రాత్రి మహాశక్తి పూజ (కుంభం పోయడం) నిర్వహించనున్నట్లు ఆలయ పీఠాధిపతులు చెన్నారెడ్డి, నంద వేమారెడ్డి తెలిపారు. మహాశక్తి పూజతోనే ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లు చేశామన్నారు. మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని వారు వివరించారు.
బెంగళూరు–కలబురిగి ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు–కలబురిగి మధ్య ప్రతి శని, ఆదివారాల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను 4 వారాల పాటు తిప్పుతున్నట్లు పేర్కొన్నారు. బెంగళూరు జంక్షన్ నుంచి (06519) ఈనెల 5, 12, 19, 26వ తేదీల్లో రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు కలబురిగి జంక్షన్‌కు రైలు చేరుతుందన్నారు. తిరిగి కలబురిగి జంక్షన్ నుంచి 06,13,20,27వ తేదీల్లో ఉదయం 9.35కు బయలుదేరి అదే రోజు రాత్రి 8 గంటలకు బెంగుళూరు చేరుతుందన్నారు. యలహంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయ రోడ్డు, రాయచూర్, కృష్ణ, యాదగిరి, షాద్‌నగర్ మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. 2టైర్, 3ఏసీ, స్లీపర్ క్లాస్‌తోపాటు జనరల్ బోగీలు ఉంటాయని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
క్రీడలపైనా ఆసక్తి చూపాలి
● విద్యార్థులకు కలెక్టర్ చేతన్ సూచన
పుట్టపర్తి టౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి చూపాలని కలెక్టర్ చేతన్ సూచించారు. శనివారం ఆయన ఎనుములపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. మోనూ ప్రకారం భోజనం అందుతుందా అంటూ ఆరా తీశారు. క్రీడలవల్ల శరీరదారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. తద్వారా చదువుపై దృష్టి పెట్టవచ్చన్నారు. క్రీడల్లో బాగా రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా ఉంటుందన్నారు. అనంతరం వంగదికి వెళ్లి సామగ్రితో పాటు ప్రభుత్వం అందిస్తున్న కోడిగుడ్లు, బియ్యం, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అఽధికారులను ఆదేశించారు. వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మురుగునీరు ఎందుకు నిల్వ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. మొత్తం వసతి గృహం మరమ్మతు పనులు ఐదురోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ అధికారి శివరంగప్రసాద్, అసిస్టెంట్ వెల్‌ఫేర్ అధికారి బాలాజీ, సంక్షేమ వసతి గృహ అధికారి విజయకుమార్ తదితరులు ఉన్నారు.
నేడు వేమన ఆలయంలో మహాశక్తి పూజ


