కురుబ లింగమయ్యది రాజకీయ హత్యే
సాక్షి, పుట్టపర్తి: రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్యది ముమ్మూటికీ రాజకీయ హత్యే అని వైఎస్సార్‌సీపీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఎ. శివ స్పష్టం చేశారు. శనివారం ఆయన లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ పరిటాల కుటుంబం ఆధిపత్యం కోసం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా గడిపారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హత్యా రాజకీయాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక బీసీ వర్గానికి చెందిన లింగమయ్యను దారుణంగా హత్య చేయించారని ఆరోపించారు. లింగమయ్య హత్యలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరో వైపు రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి శ్రీకారం చుట్టి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ద్వజమెత్తారు. రాప్తాడులో పరిటాల రాజ్యాంగం నడుస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు, హత్యలు చేస్తున్నారని, ఇవి కొన్నాళ్లే అని, తమ ప్రభుత్వం వస్తే అప్పుడు వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. హిందూపురం ఎంపీ పార్థసారథి, మంత్రి సవిత కురుబ సామాజిక వర్గానికి చెందిన వారే అయినా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. త్వరలోనే తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఆసీఫుల్లా, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు మహేష్ గౌడ్, మల్లికార్జున, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీసీ కులాలపై
పరిటాల కుటుంబం కక్ష కట్టింది
వైఎస్సార్‌సీపీ కురుబ విభాగం
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివ ధ్వజం


