రేపు మాజీ సీఎం జగన్ పర్యటన
● పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య కుటుంబానికి పరామర్శ
రామగిరి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నాటి జిల్లా పర్యటన ఖరారైంది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులైన టీడీపీ నాయకుల చేతిలో దారుణహత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన రానున్నారు. పర్యటన షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం మీడియాకు విడుదల చేసింది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గాన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10.40 గంటలకు చెన్నేకొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు వస్తారు. అక్కడి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి 10.50 గంటలకు రోడ్డు మార్గాన ఎన్‌ఎస్ గేట్ మీదుగా బయల్దేరి 11.05 గంటలకు పాపిరెడ్డిపల్లికి చేరుకుంటారు. 12.05 గంటల వరకు లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి కాన్వాయ్‌లో చెన్నేకొత్తపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.30 గంటలకు హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయల్దేరుతారు.
పర్యటన విజయవంతం చేయండి
పెనుకొండ రూరల్ : పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు పాపిరెడ్డిపల్లికి విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఉదయం 9.30 గంటలకు చెన్నేకొత్తపల్లికి చేరుకోవాలని ఆమె సూచించారు.


