రొళ్ల: మండలంలోని టీడీ పల్లి క్రాస్ సమీపంలో 544ఈ జాతీయ రహదారి మలుపు వద్ద ఆదివారం ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని నక్క మృతి చెందింది. అటవీ ప్రాంతంలో తాగునీరు, సరైన ఆహారం లభ్యం కాక కొడగార్లగుట్ట గ్రామం వైపుగా వెళుతూ జాతీయ రహదారిని దాటుతున్న క్రమంలో వాహనం ఢీకొని కుడి వైపున ఉన్న రెండు కాళ్లూ విరిగాయి. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న నక్కకు గ్రామస్తులు ఉపశమన చర్యలు చేపట్టారు. రోడ్డు మధ్యలో నుంచి పాకుకుంటూ పక్కనే ఉన్న రాళ్ల మధ్యలోకి దూరింది. సమాచారం అందుకున్న వైల్డ్‌లైఫ్ వాచర్ భీమప్ప అక్కడకు చేరుకుని, గాయపడిన నక్కను ఆస్పత్రికి తరలించేలోపు మరణించింది. అనంతరం టోల్‌ఫ్లాజా సమీపంలో ఉన్న అటవీ శాఖ నర్సరీలో నక్క కళేబరాన్ని ఖననం చేశారు.
8న హార్టికల్చర్ రాష్ట్ర సదస్సు
కూడేరు: జిల్లా కేంద్రం అనంతపురంలో ఈ నెల 8న రైతు సంఘం ఆధ్వర్యంలో హార్టికల్చర్ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకులు తెలిపారు. ఆదివారం కూడేరులో రాష్ట్ర సదస్సు కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా, మండల నేతలు రమణ, మలరాయుడు, ప్రసాద్ , వెంకటేష్ పాల్గొన్నారు.
నేడు సూరేపల్లిలో జ్యోతుల మహోత్సవం
పుట్లూరు: మండలంలోని సూరేపల్లిలో సోమవారం చౌడేశ్వరీదేవి అమ్మవారి జ్యోతుల మహోత్సవం నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చౌడేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు గంగ పూజ, చెక్క భజన ఉంటుందన్నారు. అనంతరం సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ జ్యోతుల ఊరేగింపు చేపడతామన్నారు.


