బత్తలపల్లి: ఏడీసీఏ ఆధ్వర్యంలో బత్తలపల్లిలోని ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్, బీపీఎల్ సీజన్–3 క్రికెట్ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది. ఆర్డీటీ ఆర్డీ ప్రమీల, ఏపీ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుంట్ల విజయ్‌కుమార్, సీఐలు నాగేంద్ర, ప్రభాకర్ ముఖ్యఅతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విభేదాలకు తావివ్వకుండా క్రీడాస్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ పోటీలు ఈ నెల 13వ తేదీ వరకు జరుగుతాయన్నారు. అనంతరం టీమ్ అన్నీ, టీమ్ మాంఛో, టీమ్ విష, టీమ్ విన్సెంట్, ఎంవీఎం, ఆర్డీటీ జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో క్రికెట్ కోచ్ జయరాం తదితరులు పాల్గొన్నారు.
హిటాచీకి నిప్పు
ధర్మవరం రూరల్: మండలంలోని ఓబుళనాయనపల్లి సమీపంలోని గుట్టలో మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్న హిటాచీన వాహనానికి శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పోలీసులు తెలిపిన మేరకు... ఓబుళనాయనపల్లి వద్ద ఉన్న గుట్టలోని మట్టిని టిప్పర్లకు వేసేందుకు ధర్మవరం పట్టణానికి చెందిన కిషోర్ వద్ద ఉన్న హిటాచీ వాహనాన్ని శివ లీజుకు తీసుకున్నాడు. శనివారం రాత్రి హిటాచీని అక్కడే ఉంచి డ్రైవర్, హెల్పరు ఇంటికి వెళ్లిపోయారు.
ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దుండగులు వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో పూర్తిగా కాలిపోయింది. ఆదివారం ఉదయం అక్కడికెళ్లిన డ్రైవర్ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో ధర్మవరం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మట్టి తవ్వకాల్లో తలెత్తిన విభేదాల కారణంగా నిప్పు పెట్టి ఉండవచ్చునని స్థానికులు అనుమానిస్తున్నారు.
సంతల ఆదాయం రూ.3.66 లక్షలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రాంగణంలో ఈవారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ.3.66 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ కె.గోవిందు తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత నుంచి రూ.2,25,090 వసూలు కాగా.. ఆదివారం జరిగిన పశువులు, గేదెలు, ఎద్దుల సంత నుంచి రూ.1,41,350 మేర వసూలైనట్లు పేర్కొన్నారు.
ఎఫ్‌వీఎఫ్ – బీపీఎల్ క్రికెట్ టోర్నీ ప్రారంభం


