అజరామరం.. రత్నగిరి వైభవం
రొళ్ల: మండలంలోని రత్నగిరిలో నాటి రాచరికపు వైభవం నేటికీ చెక్కుచెదరలేదు. నాడు నిర్మించిన కోటలు, చంద్రశాల, అంతఃపురం, గజశాలలు, రాతి ఏనుగులు, బురుజులు, కళ్యాణిబావులు, మంటపాలు, పురాతన కట్టడాలు, ఊరి చుట్టూ కోట, కొండపై ఎత్తైన బురుజులు, రాతి బండపై ఏర్పాటు చేసిన మెటికెలు ఇలా ఎన్నో కట్టడాలు నేటీకి అలాగే ఉన్నాయి. గ్రామంలో అక్కడక్కడ కనిపించే జైన దేవాలయాను బట్టి చూస్తే ఈ ప్రాంతంలో జైనమతం వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఈ గ్రామంలోనే వెలసింది. రాజవంశీకులతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారు, సమీపంలోని కర్ణాటక వాసులు తమ ఇలవేల్పుగా అమ్మవారిని కొలుస్తుంటారు.
ఆరు శతాబ్దాల నాటి ఆలయం
రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మి ఆలయానికి దాదాపు 628 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. వారు చెబుతున్న కథనం మేరకు.. ‘పూర్వం చౌళ రాజుల వంశానికి చెందిన రత్నగిరి సంస్థాన మహారాజైన కృష్ణప్పరాజు... సురుపూర్‌కు చెందిన రాణి గౌడమ్మను వివాహం చేసుకున్నాడు. అప్పట్లో రాణి గౌడమ్మను రత్నగిరి సంస్థానానికి గుర్రపు మార్గాన తీసుకొస్తున్నప్పుడు ఓ రకమైన శబ్ధం రావడంతో ప్రశ్నించారు. నేను కొల్హాపురి మహాలక్ష్మీదేవిని మీ సంస్థానంలో కొలువుదీరేందుకు మీ వెంట అరిసిన కుంకుమ రూపంలో వస్తున్నానని అశరీరవాణి చెబుతుంది. రాణి గౌడమ్మ సంస్థానానికి వచ్చిన మరుసటి రోజు అమ్మవారు అరిసిన కుంకుమ (పసుపు కుంకుమ) రూపంలో కొలువుదీరింది. క్రమేణ దానిపై నాగుల పుట్ట పెరుగుతుంది. దీంతో కృష్ణప్పరాజు, రాణిగౌడమ్మ అప్పట్లో గారతో అమ్మవారి (కొల్హాపురి మహాలక్ష్మీదేవి) ప్రతిమను చేయించి ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆలయంలో విశేష పూజలు కొనసాగుతూ వస్తున్నాయి.’
13వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు
ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు రత్నగిరిలో కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజవంశీకుడు రంగప్పరాజు (దొర), ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు. 13న జలధి ఉత్సవం, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 14న బ్రహ్మరథోత్సవం, ధూళోత్సవం, 15న జలధి, కలశ ఉత్సవం, గంగ పూజ, 16 నుంచి 19వ తేదీ వరకు అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలు, 20న అమ్మవారికి పుష్పాలంకారణ, పోతులరాజుల విశేష పూజ, 21న పోతురాజు బండార కార్యక్రమం, తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా పశువుల జాతరను నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవాలకు వచ్చి వెళ్లే భక్తుల సౌకర్యార్థం మడకశిర డిపోతో పాటు కర్నాటకలోని మధుగిరి, శిర, పావగడ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
నేటికి చెక్కు చెదరని కోటలు, పురాతన కట్టడాలు
భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొల్హాపురి మహాలక్ష్మీదేవి
13 నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు
అజరామరం.. రత్నగిరి వైభవం
అజరామరం.. రత్నగిరి వైభవం


