చేతిలోని మొబైల్ లాక్కెళ్లిన దొంగ
రాప్తాడు రూరల్: చేతిలో మొబైల్ పట్టుకుని చూస్తుండగా ఓ యువకుడు లాక్కొని ఉడాయించిన ఘటన ఆదివారం సాయంత్రం అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాలు... అనంతపురం రూరల్ మండలం కొడిమి పంచాయతీ దర్గాకొట్టాలుకు చెందిన జాఫర్ పెయింటింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనిపై ఆదివారం నగరానికి వచ్చిన ఆయన సాయంత్రం బళ్లారి రోడ్డు కూడలిలో ఆటో కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో ఫోన్ రింగ్ కావడంతో జేబులో నుంచి తీసి చూస్తుండగా రెప్పపాటులో ఓ యువకుడు లాక్కొని కళ్యాణదుర్గం రోడ్డు వైపుగా పరుగుతీశాడు. జాఫర్ తేరుకుని గట్టిగా కేకలు వేసినా లాభం లేకపోయింది. చీకట్లు ముసురుకుంటుండడంతో సెకన్లలోనే ఆ యువకుడు కనిపించకుండా పోయాడు. ఇటీవలే రూ. 20 వేలు పెట్టి మొబైల్ కొనుగోలు చేశానని, ఇంతలో ఇలా జరిగిదంటూ బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


