పాపిరెడ్డిపల్లికి కొందరికే అనుమతి
పెనుకొండ: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. సోమవారం ఆమె పెనుకొండలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పాపిరెడ్డిపల్లిలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాపిరెడ్డిపల్లి కుగ్రామం కావడం... రహదారులు చిన్నగా ఉండడంతో ఎక్కువ మంది గ్రామంలో పర్యటించేందుకు వీలు లేదన్నారు. ఈ పరిస్థితి దృష్ట్యా వైఎస్ జగన్ వెంట ఎక్కువ మందిని గ్రామంలోకి అనుమతించబోమన్నారు. పార్టీ నాయకులు పోలీసుల సూచనలు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రితోపాటు అనుమతి కలిగిన నాయకులను మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తామని ఎస్పీ తెలిపారు.
జగన్‌ను అడ్డుకునే
ధైర్యం మాకుంది
● మాలో పరిటాల, చంద్రబాబు,
టీడీపీ బ్లడ్ ఉంది
● రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
వివాదాస్పద వ్యాఖ్యలు
రాప్తాడురూరల్: ‘వైఎస్ జగన్‌ను రాప్తాడు రాకుండా అడ్డుకునే దమ్ము, ధైర్యం మాకున్నాయి. మాలో పరిటాల, చంద్రబాబు, టీడీపీ బ్లడ్ ఉంది. ఆయన ఇక్కడ దిగకుండా తిరిగి పంపే శక్తీ ఉంది’ అంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె రామగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ను అడ్డుకుందామంటూ తమ కార్యకర్తలు, నాయకులంతా కోరుతున్నారని తెలిపారు. పర్యటనకు వచ్చే జగన్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలని సూచించారు. టీడీపీ నేతలు ఎక్కడా సంయమనం కోల్పోవద్దన్నారు.
సింహ వాహనంపై
రంగనాథుడు
తాడిపత్రి: ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి సింహ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. రంగనాథస్వామిని ప్రత్యేక పూలు, ఆభరణాలతో అర్చకులు అలంకరించారు. రాత్రి సింహ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.
పాపిరెడ్డిపల్లికి కొందరికే అనుమతి


