ఆస్పత్రిని పరిశీలించిన కాయకల్ప బృందం
హిందూపురం టౌన్: పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని కాయకల్ప బృందం గురువారం పరిశీలించింది. విజయవాడ నుంచి కాయకల్ప బృందం డాక్టర్లు రామారావు, నరేష్, క్వాలిటీ కంట్రోలర్ సుబ్రహ్మణ్యం పాల్గొని ఆస్పత్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఏటా కాయకల్ప అవార్డు అందిస్తుంది. ఇంటర్నల్ అసెస్మెంట్‌లో భాగంగా బృందం సభ్యులు ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి స్వచ్ఛత, సదుపాయాలు, బయోమెడికల్ వేస్టేజ్, ల్యాబ్, మందుల నిర్వహణ, పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, బెడ్స్ నిర్వహణ, వార్డులో రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పలు అంశాలను మెరుగుపరుచుకవాలని బృందం సభ్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు.


