ఉద్యాన రైతులూ అప్రమత్తంగా ఉండండి
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, పెను గాలులు, వడగండ్లు, అకాల వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఉద్యాన తోటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని రెండు జిల్లాల ఉద్యానశాఖ అధికారులు జి.చంద్రశేఖర్, జి.ఫిరోజ్‌ఖాన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా పంట చేతికివచ్చే సమయం కావడంతో చీనీ, మామిడి, అరటి, బొప్పాయి, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అరటి, బొప్పాయి పంటలు నేలవాలకుండా సరైన పోట్లు ఏర్పాటు చేసుకుంటే నష్ట తీవ్రత బాగా తగ్గుతుందని తెలిపారు. తోట చుట్టూ వెలుపలి ప్రాంతంలో నీటి తడి ఇస్తే సుడిగాలి తీవ్రత బాగా తగ్గిపోతుందన్నారు. పెను గాలులకు దెబ్బతిన్న తోటల్లో వెంటనే కాయలు, గెలలు తొలగించి, కొమ్మలను బయట పడేయాలన్నారు. చీడపీడల బారి నుంచి రక్షించుకునేందుకు లీటర్ నీటికి 2.5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలన్నారు. నిల్వ ఉన్న వర్షపు నీరు ఆవిరైన తర్వాత పైపాటుగా ఎకరాకు 10 కిలోల యూరియా చల్లుకోవాలన్నారు. తోటల చుట్టూ అవిశె, సుబాబుల్ లాంటి రక్షణ పంటలు వేసుకుంటే పెనుగాలుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చన్నారు. అవకాశం ఉన్న రైతులు కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వేసవి సమస్యల నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు.


