జగన్‌ను విమర్శించే స్థాయి నీకెక్కడిది?
ఉరవకొండ: జనంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు లేదని శాసనమండలి ప్రివిలైజ్ కమిటీ చైర్మెన్/ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీకి తొత్తులుగా మారిన కొందరు పోలీసులను ఉద్దేశించి తప్పు చేసిన పోలీసులైన చట్టం ముందు సమానమేనని, వారి యూనిఫాం తీసేయిస్తామని వైఎస్ జగన్ వ్యాఖ్యానిస్తే... దానిని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలుగా చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌కు పటిష్ట భద్రతను అప్పటి సీఎం వైఎస్ జగన్ కల్పించారని గుర్తు చేశారు. ఈ అంశంపై అప్పట్లో ఒక్క ఆరోపణ కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా భద్రతా వైపల్యం కనిపిస్తోందన్నారు. వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనలో 1,100 మంది పోలీసులను, 200 మందిని హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంటూ భద్రతా వైపల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేవలం అభిమానులను, కార్యకర్తలను ఆపడానికి పోలీసులను మోహరించారు కానీ, మాజీ సీఎం భద్రతకు కాదనే విషయం క్షేత్ర స్థాయిలో బట్టబయలైందన్నారు. వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏ పార్టీలోనైనా మహిళల వ్యక్తిత్వాన్ని తప్పు పట్టేలావ్యాఖ్యలు చేయడం తగదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌పై
ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మండిపాటు
తప్పు చేస్తే పోలీసులైనా
చట్టం ముందు సమానమే
నేర నిరూపణ అయితే యూనిఫాం తీసేసి శిక్ష అనుభవించాల్సిందే


