తల్లిదండ్రులకు విద్యార్థుల అప్పగింత
ధర్మవరం అర్బన్: సరదాగా రైలు ఎక్కిన తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల ఆచూకీని పోలీసులు గుర్తించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చారు. వివరాలు.. ధర్మవరంలోని కొత్తపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జస్వంత్, విజయ్‌కుమార్ గురువారం స్థానిక రైల్వే స్టేషన్‌లో సరదాగా రైలు ఎక్కిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులు ఎక్కిన సమయంలో రైలు ముందుకు కదలడంతో వారు కిందకు దిగలేకపోయారు. పిల్లలు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన రెండో పట్టణ సీఐ రెడ్డప్ప.. చొరవ తీసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు రైల్వే స్టేషన్‌లో తచ్చాడుతున్న ఇద్దరు విద్యార్థులను గుర్తించిన ధర్మవరం పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పిలుచుకొచ్చారు. కౌన్సెలింగ్ అనంతరం విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు.
ప్రమాదంలో వ్యక్తి మృతి
పావగడ: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. వివరాలు... పావగడ తాలూకా నాగలమడక హోబళి గ్యాదికుంటె గ్రామానికి చెందిన బాబు (45)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం వ్యక్తిగత పనిపై పొరుగున ఉన్న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలానికి వెళ్లాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన అదే మండలం తిమ్మాపురం–కొండాపురం గ్రామాల మధ్య ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


